ఈసారి తెలంగాణ సర్కారుకు షాకిచ్చిన హైకోర్టు 

Hight court fires on Telangana government
Nఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ హైకోర్టు అక్కడి ప్రభుత్వానికి షాకిచ్చింది.  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్, అనంతగిరి, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల ముంపు బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.  ప్రాజెక్టు కోసం భూమిలిచ్చిన రైతులు 120 మంది తమకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ఇవ్వకుండా కాంట్రాక్ట్ పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు.  
 
వాటిపై విచారణ చేపట్టిన కోర్టు ఒప్పంద పత్రాలపై పిటిషనర్లతో బలవంతంగా సంతకాలు చేయించడం చెల్లదని, ఆ ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండాల్సిన అవసరంలేదని తేల్చిచెప్పింది. అధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని ఆక్షేపించింది.  అనంతగిరి రైతుల వద్ద నుండి తక్కువ పరిహారం చెల్లించేలా సంతకాలు ఎలా చేయించుకున్నారు, బాధితులు ఆర్ఆర్ ప్యాకేజీ, ఇతర హకులను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ధర్మాసనం ముందు ప్రభుత్వం ప్రస్తావించలేకపోయింది.  
 
అంతేకాదు కేసు విచారణలో అడ్వకేట్ జనరల్ తీరును కూడా కోర్టు తప్పుబట్టింది.  నీటి విడుదల సమయంలో పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని కోరిన ఏజీ ఇప్పుడు మాత్రం వీడియో కాన్ఫరెన్స్ విధానంలో అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని అనడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.  పిటిషన్ దారులకు ఒక్కొక్కరికీ కోర్టు ఖర్చుల కింద 2 వేలు చెల్లించాలని, పూర్తి  పరిహారాన్ని మూడు నెలలోగా అందజేయాలని ఆదేశించారు.