‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ..

మెగాస్టార్ చిరంజీవి – రవితేజ కలయికలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేసింది.

దేవి శ్రీ ప్రసాద్ తన మాస్-అప్పీలింగ్ కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్‌ ఊపందుకునేలా సాగాయి. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’.ఈ శుక్రవారం (13, జనవరి – 2023) విడుదలైంది. మరి సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా..లేదా.. ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..!

కథ : వాల్తేరు వీరయ్య (చిరంజీవి) ఓ కేసు నెగ్గడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఆ కేసుకు సంబంధించిన సాక్షిని ప్రవేశ పెట్టాలి. దాని కోసం కేసును వాయిదా వేయించడానికి వీరయ్య పాతిక లక్షలు లంచం ఇవ్వాల్సి వస్తోంది. ఎలాగైనా ఆ డబ్బు సంపాదించాలనుకుంటాడు. అందుకోసం వీరయ్య ఓ పని ఒప్పుకుంటాడు. అలా వీరయ్య ఒప్పుకున్న పని ఏమిటి? ఆ కేసు వెనక ఉన్న పూర్వాపరాలేమిటి?

కేసుకు సంబంధించిన అసలు కథ ఏమిటీ? కథానాయిక అతిధి (శృతిహాసన్) ట్రాక్ ఏమిటి ?, ఇంతకీ వీరయ్య గతం ఏమిటి?, వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కి విక్రమ్ సాగర్ (రవితేజ) సవతి తల్లి కొడుకు. పరిస్థుతులు కారణంగా ఇద్దరు చిన్నతనంలోనే దూరం అవుతారు. వైజాగ్ లో వీరయ్య తన గ్యాంగ్ తో మందు బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడకి ఎసీపీగా వచ్చిన విక్రమ్ సాగర్ వీరయ్యను ఎలా అడ్డుకున్నాడు?, ఈ క్రమంలో వీరయ్యకి తెలియకుండా జరిగిన పొరపాటు ఏమిటి ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ప్రేక్షకులు, అభిమానులు మెగాస్టార్ ను కమర్షియల్ సినిమాల్లో చూడటాడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రేక్షకులు ఆయన నుండి ఏం కోరుకుంటున్నారో అది వందకి వందశాతం ఇవ్వాలనే ప్రయత్నంతో ‘వాల్తేరు వీరయ్య’ జరిగింది. పూనకాలు లోడింగ్ అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాగా ఆకట్టుకున్నాడు. మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చింది ఈ సినిమా. అలాగే ఇంట్రస్ట్ గా సాగే మెగాస్టార్ – రవితేజ క్యారెక్టరైజేషన్స్ మరియు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ అండ్ చిరు కామెడీ టైమింగ్, మెయిన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ పై ఆసక్తిని తారాస్థాయికి తీసుకువెళ్ళలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అభిమానులకే కాదు.. ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా సాగింది. వీరయ్య – రవితేజ పాత్రలు, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో బాబీ చాలా స్లోగా ప్లే నడిపాడు. అయితే, పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ సినిమా స్థాయికి తగ్గట్టు లేక ప్రేక్షకుడిని కాస్త నిరాశకు గురి చేస్తుంది. కథలోని ప్రధాన పాత్రల పై బాబీ పెట్టిన ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఒక ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, అన్నయ్యలో ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ రైజేషన్ తో ఈ సినిమాని పోల్చుకోవచ్చు. ప్రతి సీన్ ఎంటర్ టైన్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా సినిమా వస్తుందంటే అందులోని కథ.. కథకు తగ్గ ఎమోషన్ చూస్తారు ప్రేక్షకులు. పాటలు, ఫైట్లు చిత్రానికి అదనపు అలంకరణలు అవుతాయి.

ఏ సినిమా అయినా ఎమోషన్ కనెక్ట్ అయితేనే ప్రేక్షకులని హత్తుకుంటుంది. వాల్తేరు వీరయ్య కథ లో అంత గొప్ప ఎమోషన్ వుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో, మెగా ఎంటర్ టైన్మెంట్ తో గ్రాండ్ విజువల్స్ తో విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు కథలోని మెయిన్ ఎమోషన్ కూడా అలరించింది. అలాగే చిరంజీవి పాత్రలోని షేడ్స్ ను, శృతిహాసన్ తో సాగే సన్నివేశాలను, అలాగే ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని రవితేజ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను దర్శకుడు బాబీ చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రవితేజ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. రవితేజ అప్పటికి ఇప్పటికీ అదే ఎనర్జీ తో వున్నాడు. ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ పాత్ర ద్వారా కథకు మరింత బలం చేకూరింది. ఆయన పాత్రలో చాలా ఎమోషన్ వుంటుంది. ఆ పాత్రకు అతడు పూర్తి న్యాయం చేశాడు. ఇక వీరయ్య పాత్రకు చిరంజీవి ప్రాణం పోశారు. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు.

చిరు – శృతి హాసన్ ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రవితేజ కూడా చాలా బాగా నటించాడు. ఊర్వశి రౌతేలా చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ మంచి మార్కుల్ని కొట్టేసింది. ఆయనకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండే! రవితేజకు జోడీగా నటించిన క్యాథరిన్ తన నటనతో ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక సెకండాఫ్ లో కూడా కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగింది. దీనికితోడు కొన్ని సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. ప్రకాష్ రాజ్ ట్రాక్ పూర్తి సినిమాటిక్ గా సాగింది. విలన్ – హీరో మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది.

టెక్నీకల్ విషయాలాకొస్తే.. దేవిశ్రీ ఇచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మ్యూజిక్ చాలా బావుంది. నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాట చాలా చిలిపితనంతో కూడుకుని ఆకట్టుకోగా, అలాగే బాస్ పార్టీ, నీకేమో అందం ఎక్కువ పాటలు కూడా అలరించాయి. ఇందులో వుండే పాటలన్నీ వేటికవే ఆద్యంతం ఆకట్టుకునేలా సాగాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. అలాగే నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సీన్ ను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఎడిటర్ సినిమాలోని స్లో సీన్స్ ను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది.

నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నేషనల్ రేంజ్ లో భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడిగా బాబీ బాగా ఆకట్టుకున్నాడు. సుస్మిత ఎంతో మాసీగా చేసిన డిజైన్ షర్టులు మెగాస్టార్ కి సూపర్ లుక్ ని తెచ్చిపెట్టాయి. గతంలో ఇంత మాసీ అవుట్ ఫిట్స్, కాస్ట్యూమ్స్ ఎప్పుడూ వేయలేదు. ఇంద్ర, గ్యాంగ్ లీడర్ షర్ట్ లు అప్పట్లో చాలా ట్రెండ్ అయ్యాయి. ‘వాల్తేరు వీరయ్య’లో ఉన్న షర్ట్ లు ట్రెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తంమీద ఈ సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా చెప్పుకోవచ్చు.
-ఎం.డి. అబ్దుల్

నటీనటులు : చిరంజీవి, శృతిహాసన్,రవితేజ, క్యాథరిన్, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, సత్యరాజ్, బాబీ సింహా, జాన్ విజయ్, నాజర్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్ త‌దిత‌రులు

చిత్రం : వాల్తేరు వీరయ్య
విడుదల తేదీ : జనవరి 13, 2023
రేటింగ్ : 3/5
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్థర్.ఎ.విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
దర్శకత్వం : బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర)