(చిత్రం : సామజవరగమన, విడుదల : 29, జూన్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తదితరులు. దర్శకుడు : రామ్ అబ్బరాజు, నిర్మాత: రాజేష్ దండా, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్)
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. ఈ చిత్రంలో శ్రీవిష్ణు కు జోడీగ రెబా మోనికా జాన్ నటించారు. విడుదలకు ముందు సినిమా బావుండబోతోందన్న సంకేతాలు ఇచ్చారు యూనిట్. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…
కథ: ప్రేమలో విఫలమై..ఆ ప్రేమ పైనే ఒకరకమైన నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు బాలు (శ్రీవిష్ణు). అందులో భాగంగానే తనకు ఎవరైనా అమ్మాయి ఐలవ్ యూ.. అని చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటుంటాడు.ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు (రెబా మౌనికా జాన్)తో పరిచయం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది. దీంతో బాలు, సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది. మరి తర్వాత ఏమైంది? చివరకు వీరి ప్రేమ కథ ఎక్కడికి దారితీసింది?, ఈ మధ్యలో సరయు తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) పాత్ర ఏమిటి?, అలాగే బాలు తండ్రి (సీనియర్ నరేష్) డిగ్రీ పాసయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి? అనేది కథ.
విశ్లేషణ : ఈ సినిమాలో దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా క్యారెక్టర్స్ ద్వారా మంచి ఫన్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చేయడానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అదే విధంగా పాత కాలపు మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో నెట్టుకొచ్చాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసామన్న భావన కలుగుతుంది. అయితే ప్రేక్షకులు మాత్రం చాలా సార్లు హాయిగా నవ్వుకుంటారు. ఇక సీనియర్ నరేష్ క్యారెక్టర్ ను మొదట్లో బాగా ఎలివెట్ చేసి ఆ తర్వాత గెస్ట్ రోల్ లా ఆ పాత్రను కుదించారు. అయితే. సినిమా మొత్తం ప్రేక్షకులకు వినోదాల విందునే అందించింది. ముఖ్యంగా ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అలాగే సీనియర్ నరేష్ ట్రాక్, శ్రీకాంత్ అయ్యంగార్ ఫ్యామిలీ ట్రాక్, మరియు కామెడీ సన్నివేశాలు..ఇంకా హీరోహీరోయిన్లు అనుకోని సంఘటనలతో చిక్కుకునే సన్నివేశాలు.. వారు ఆ సమస్యల నుంచి హీరో తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ఆయా సన్నివేశాల్లో శ్రీ విష్ణు ఎంతో బాగా నటించి మంచి మార్కుల్ని కొట్టేశాడు.
సినిమా ద్వీతీయార్ధంలో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు. ఇక మరో ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నరేష్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. డిగ్రీ పాస్ కాలేని సగటు మిడిల్ క్లాస్ తండ్రిగా నరేష్ నటన సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలిచి ప్రేక్షకులను విశేషంగా అలరించిందని చెప్పొచ్చు. కథానాయికగా నటించిన రెబా మౌనికా జాన్ బాగానే చేసింది. తన నటనతో ఆద్యంతం అలరించింది. తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ మెప్పించింది. మరో కీలక పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తమ కామెడీ టైమింగ్ తో బాగా వినోదాన్ని పంచారు. ఈ పాత్రలను కూడా కథకు టర్నింగ్ పాయింట్ గా దర్శకుడు చాల బాగా రాసుకున్నాడు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ కూడా అందర్నీఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాలోని ప్రధాన పాత్రలు, ఆ పాత్రల మధ్య డ్రామా, మరియు నటీనటుల నటన.. మొత్తమ్మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్ టైన్ గా నడిపాడు. కాకపోతే, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకుడు రామ్ అబ్బరాజు కామెడీ సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. గోపీ సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను రాంరెడ్డి చాలా అందంగా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాత రాజేష్ దండా నిర్మాణ విలువులు బావున్నాయి. మొత్తం మీద ‘సామజవరగమన’ అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుటుంది.