నవతరం కథానాయకుడు బెల్లంకొండ గణేష్ నటించిన తన తొలి చిత్రం ‘స్వాతి ముత్యం’తో నటుడిగా మంచి పేరునే తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత తాను చేసిన రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ఈ సినిమా పలు మార్లు వాయిదా కూడా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం 2 జూన్, 2023న చిత్రం విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం…
కథ : ఓ కాలేజ్ స్టూడెంట్ సుబ్బు(గణేష్ బెల్లంకొండ). ఓ మంచి ఐఫోన్ కొనుక్కోవాలనేది అతడి కల. తాను ఎప్పుటి నుంచో దానికోసమే ఆలోచిస్తుంటాడు. అలా.. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో అయితే ఐఫోన్ 12ని కొనుక్కుంటాడు. అయితే… ఆ ఫోన్ వల్ల ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అదీ కాకుండా తన బ్యాంక్ అకౌంట్ లో భారీ నగదు కూడా క్రెడిట్ అవుతుంది. దాంతో తన చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంటుంది. మరి ఇలాంటి సమస్యల నుంచి అతడు ఎలా బయట పడ్డాడు? ఇంతకీ దీని వెనుక ఉన్నది ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే…
విశ్లేషణ : ఈ సినిమాలో కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే బాగానే ఉన్నా అసలు సమస్య ఫస్టాఫ్ లో ఉందని చెప్పాలి. తొలిసగం కాస్త బోరింగ్ గా సాగదీతగా కొనసాగింది. ప్రధానంగా మెయిన్ లీడ్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ ఏమంత గొప్పగా అనిపించదు. దీంతో ప్రేక్షకులకి ఒక దశలో చికాకు కలిగించింది. అలాగే ఈ సినిమాలో కొందరు నటీనటులకు వారిపై సీన్స్ లో వారి నటనకి వినిపించే డబ్బింగ్ కి అసలు సింక్ కూడా ఉండదు. అంత జాగ్రత్తగా మేకర్స్ సినిమాని తెరకెక్కించినట్టు అనిపించింది. అలాగే సినిమా మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళడానికి సెకండాఫ్ లో కూడా సమయం ఎక్కువే తీసుకున్నారు. సినిమా అంతా కూడా చాలా సో సో గానే సాగుతుంది. మెయిన్ గా అనవసర బోరింగ్ సన్నివేశాలు ఎడిట్ చేసేయాల్సింది. ఇంకా కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి అంతే కాకుండా.. కొన్ని సీన్స్ లో డైలాగ్స్ అలా రిపీటెడ్ గా రావడం ఆడియెన్స్ కి విసుగు తెప్పించింది. అయితే.. దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు మాత్రం ఆకట్టుకుంది. ఈ చిత్రం ఎంతో ఆసక్తికరంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కాలంలో ఫైనాన్సియల్ గా ఎన్నో స్కామ్ లు ఎలా జరుగుతున్నాయి. ఈ అంశాన్ని సినిమాలో బాగా తెరకెక్కించారు. అలాగే దీనికి అనుగుణంగా ఇచ్చిన మెసేజ్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆలోచింపజేసింది. ఆయా సన్నివేశాలు సైతం అందర్నీ అలరించాయి. చివరలో అయితే.. నటుడు సునీల్ పాత్రతో ఇచ్చిన ఎండింగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు రాఖీ ఉప్పలపాటి ఈ థ్రిల్లర్ ని పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేయలేకపోయారని చెప్పాలి. సినిమాలో మంచి థీమ్ ఉన్నప్పటికీ కూడా దానిని అనవసర సన్నివేశాలతో నింపేసి సమయాన్ని వేస్ట్ చేశారనిపించింది. బెటర్ సీన్స్ ని ఈ థ్రిల్లర్ డ్రామాలో ప్లాన్ చేసి ఉంటే ఈ సినిమా అవుట్ పుట్ మరింత బెటర్ గా వచ్చి ఉండేది.
ఎవరెలా చేశారంటే… హీరో గణేష్ బెల్లంకొండ తన తొలి చిత్రం కంటే ఇందులో మెరుగైన నటనను కనబరిచాడు. అంతేకాదు.. తనని తాను బెటర్ గా ప్రెజెంట్ చేసుకునే ఛాన్స్ కూడా వచ్చిందనే చెప్పాలి. ఓ యంగ్ ఇన్నోసెంట్ స్టూడెంట్ గా అయితే సెన్సిబుల్ ప్రతిభని ఈ చిత్రంలో కనబరిచాడు. అలాగే క్లైమాక్స్ లో అయితే.. తన నటనలో మరింత పరిణితి కనిపించింది. ముందే చెప్పుకున్నట్టుగా సునీల్ వచ్చిన తర్వాత సినిమా ఎంతో ఆసక్తిగా మారుతుంది. తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్ తో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం విషయానికొస్తే… ముందుగా చెప్పుకోవలసింది మహతి స్వర సాగర్ అందించిన సంగీతం గురించి. అతడి సంగీతం బేషుగ్గా ఉండి ప్రేక్షకుల్ని అలరించిందని చెప్పొచ్చు. అలాగే తన ‘మాయే మాయే’ సాంగ్ విజువల్ గా ఏంతో బాగుంది. అనిత్ సినిమాటోగ్రఫీ కూడా ఎంతో రిచ్ గా కనిపించింది. ఎడిటింగ్ వర్క్ సోసోనే. నిర్మాణ విలువలు స్థాయితగ్గట్టుగానే ఉన్నాయి. ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కించిన తీరు కనిపించింది. మొత్తం మీద ఈ “నేను స్టూడెంట్ సర్” లో మంచి కాన్సెప్ట్ అండ్ మెసేజ్ కనిపించినప్పటికీ.. సరైన స్క్రీన్ ప్లే లేదు. పైగా సినిమా చివరలో కొన్ని ఎలిమెంట్స్ తప్ప ఫస్ట్ నుంచి అయితే పూర్తి స్థాయి ఎంగేజింగ్ డ్రామాగా అయితే మెప్పించదు. అందుకే ఈ చిత్రం జస్ట్ ఓకే మాత్రమే!!
(చిత్రం : నేను స్టూడెంట్ సర్, విడుదల తేది : జూన్ 2, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: గణేష్ బెల్లంకొండ, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్ తదితరులు. దర్శకత్వం : రాఖీ ఉప్పలపాటి, నిర్మాతలు: నంది సతీష్ వర్మ, సంగీతం : మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్).