పూరీ మార్కు లవ్ యాక్షన్! ‘లవర్’ (రివ్యూ)

(సికిందర్ రివ్యూ)

 

రచన – దర్శకత్వం : అనీష్ కృష్ణ
తారాగణం : రాజ్‌ తరుణ్‌, రిద్ధీ కుమార్‌, సచిన్‌ ఖేడేకర్‌, సుబ్బరాజు, అజయ్, రాజీవ్‌ కనకాల, సత్యం రాజేష్,  సత్య, ప్రవీణ్‌ తదితరులు
సంగీతం: అంకిత్‌ తివారీ, ఛాయాగ్రహణం:  సమీర్ ‌రెడ్డి
బ్యానర్‌: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌
నిర్మాత: హర్షిత్‌రెడ్డి
విడుదల :  జులై 20, 2018


రేటింగ్ : 2 / 5

***

        యువహీరో రాజ్ తరుణ్ కి ఈ మధ్య సక్సెస్ లు దూరమై ఆత్మ రక్షణలో పడ్డాడు. నటించిన గత 12  సినిమాల్లో మూడే సక్సెస్ లు కన్పిస్తున్నాయి. 2015 లో ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత  వరసబెట్టి అన్నీ ఫ్లాపులే. తాజాగా ‘లవర్’ ఈవారం బాక్సాఫీసు పరీక్షకి నిలబడింది. దీన్ని అగ్రనిర్మాత దిల్ రాజు నిర్మించారు. పేరున్న బ్యానర్ లో రాజ్ తరుణ్ నటించడమంటే ఇక ఫ్లాపుల బాధ వదిలించుకోవడమే. అయితే పేరున్న బ్యానర్ ఒక్కటే సరిపోక పోవచ్చు తిరిగి విజయం పొందడానికి – అందుకు తగ్గ విషయం కూడా ఒప్పుకున్న సినిమాలో వుండాలి. మరి 9 వరస ఫ్లాపులకి భిన్నంగా ప్రస్తుత సినిమాలో ఏముంది? ఏమైనా తేడా కనబర్చాడా, లేక 9 ని 10  చేశాడా ఇప్పుడు చూద్దాం.

కథ 
అనంత పురంలో రాజ్ (రాజ్ తరుణ్)  ఒక అనాధ. బైక్ మెకానిక్ గా పనిచేస్తూంటాడు. అదే వూళ్ళో సుబ్బు (సుబ్బరాజు)  అనే ముఠా నాయకుడి దగ్గర రాజీవ్ (రాజీవ్ కనకాల) వుంటాడు. ఈ రాజీవ్ ని అన్నగా భావిస్తూ అతనింట్లోనే వుంటాడు రాజ్. ఒకరోజు ముఠా తగాదాల్లో గాయపడి హాస్పిటల్లో చేరతాడు. అక్కడ  నర్సుగా పనిచేసే చరిత (రిద్ధీ కుమార్‌) ని చూడగానే ప్రేమిస్తాడు. ఆమె ప్రేమని పొంది పెళ్లి చేసుకుంటాడనగా, వరదరాజన్ (సచిన్‌ ఖేడేకర్‌) గ్యాంగ్ చరితని కిడ్నాప్ చేస్తారు. ఎవరీ వరదరాజన్? ఎందుకు కిడ్నాప్ చేశాడు? అప్పుడు రాజ్ చరితని ఎలా రక్షించుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ


          పూరీ జగన్నాథ్ మార్కు టెంప్లెట్ కథ. ఇలాటిది దిల్ రాజు తీయలేదు, రాజ్ తరుణ్ నటించలేదు. ఇద్దరికీ ఆ కోరిక తీరింది. హీరో ప్రేమకోసం హీరోయిన్ వెంట పడడం, తీరా ప్రేమించాక మాఫియా విలన్ ఎంట్రీ ఇవ్వడం, హీరోయిన్ కేదో హాని తలపెట్టడం, హీరో కాపాడుకోవడమనే  ఒకే టెంప్లెట్ తో పదేపదే పూరీ తీస్తూ ఫ్లాపవుతున్నాక, తన ఫ్లాప్స్ కి ఈ కారణం ఆయనా తెలుసుకోక, ఇప్పుడు దిల్ రాజూ-  రాజ్ తరుణ్ లూ గ్రహించక ఈ టెంప్లెట్ ని తెచ్చి వాడేశారు. ‘అలా ఎలా’ అనే ప్రేమకథ తీసిన  దర్శకుడు అనీష్ కృష్ణ,  తను యాక్షన్ కూడా తీయగలనని నిరూపించుకునే ఉద్దేశంతో, తనూ పూరీ టెంప్లెట్ లో తెలియకుండానే పడిపోయాడు. వెరసి ఇంకో పూరీ సినిమాలా తయారయ్యింది.

ఎవరెలా చేశారు


          పూరీ జగన్నాథ్ సినిమాలో నటించలేదన్న వెలితి రాజ్ తరుణ్ కి వుంటే, అది ఈ రూపంలో తీరిపోయింది. మరో యాక్షన్ లవర్ పాత్ర చేశాడు. టైటిల్ ప్రకారం టెండర్ లవ్ స్టోరీ అయివుంటుందన్న ఊహని తలకిందులు చేశాడు.  అయితే రెండు గంటల నిడివి గల ఈ రోమాంటిక్ యాక్షన్లో గంట ముప్పావు సేపూ ప్రేమికుడిగానే కన్పిస్తాడు. ఇది నస పెడుతుంది. ఎందుకంటే, తన వెనుక బోలెడు మాఫియా కుట్ర జరుగుతూంటుంది. ఇంటర్వెల్లో హీరోయిన్ మీద దాడి కూడా జరుగుతుంది. అయినా  ఇదేమీ పట్టకుండా వుండిపోతాడు.  చిట్ట చివర్లో హీరోయిన్ కిడ్నాపయ్యాకే  జరుగుతున్నది తెలుసుకుని కథలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకూ కథలోకి ప్రవేశించే మాటే లేదు. అంటే,  ఒకప్పుడు మహేష్ బాబు నటించిన అట్టర్ ఫ్లాప్ ‘బాబీ’  లాంటి పరమ పాసివ్ పాత్ర అన్నమాట. ఇక ఫస్టాఫ్ లో లవ్ అంతా కూడా  టెంప్లెట్ కామెడీయే. ఈ కామెడీలో రెండు మూడు చోట్ల తప్ప ప్రేక్షకులు నవ్వే పరిస్థితి లేదు. ప్రేమలో బలమైన సన్నివేశాలు గానీ, కదిలించే భావోద్వేగాలు గానీ లేవు. అసలు కథలో ప్రవేశిస్తే కదా?
హీరోయిన్ రిద్దీ కుమార్ ఓ మాదిరిగా ముంది. పెద్ద గ్లామరున్న నటి కాదు. ఇక పాత్రల్లో విలన్లుగా, కమెడియన్లుగా నటించిన వాళ్ళగురించి చెప్పుకోవడానికేమీ లేదు.
ప్రొడక్షన్ విలువలు, సమీర్ రెడ్డి ఛాయగ్రహణం ఉన్నతంగా వున్నాయి. సంగీత దర్శకులు ఆరుగున్నారు. కానీ మ్యూజికల్ గా హిట్స్ ఏమీ ఇవ్వలేదు. యాక్షన్ సీన్లు బాగా తీశారు.

చివరికేమిటి


          దర్శకుడు అనీష్ కృష్ణ,  పూరీ టెంప్లెట్ ని వున్నదున్నట్టు డైరెక్టుగా వాడలేదు. అసలు విలన్ల కుట్రేమిటో,  హీరోయిన్ వెంట ఎందుకు పడుతున్నారో, ప్రేక్షకులకి కథ తెలియనివ్వకుండా,  చివరి వరకూ ఎండ్ సస్పెన్స్ గా పెట్టి నడిపాడు. ఇదే కొంప ముంచింది. ఎండ్ సస్పెన్స్ తో వచ్చిన అన్ని సినిమాలకీ పట్టిన గతే దీనికీ పట్టింది. పైగా ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే కూడా అయింది. చివరికి విప్పిన విషయం కూడా కాపీ కొట్టిందే.  గోపీచంద్ నటించిన ‘ఒక్కడున్నాడు’ లో అరుదైన బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన విషయమే. దర్శకుడు ‘లవర్’  అనే సున్నిత టైటిల్ తో,  ఈ కాలపు ట్రెండీ లవ్ స్టోరీ తీయకుండా, ఈసారి యాక్షన్ డైరెక్టర్ అన్పించుకోవాలన్న  అత్యాశతో, స్క్రీన్ ప్లే పట్ల అవగాహనా లేమితో,  కలగూరగంప చేశాడు.

సికిందర్

దిల్ రాజు లవర్ ప్లాప్ అవ్వటానికి కారణం…..స్క్రీన్ ప్లే మీద విశ్లేషణ