‘హంట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి యువ దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ గురువారం (జనవరి 26, 2023) థియేటర్లలో విడుదలయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…

కథలోకి… ఏసీపీ అర్జున్ (సుధీర్ బాబు) ఓ రోడ్డు ప్రమాదంలో మెమరీ లాస్ అవుతాడు. తన మిత్రుడు ఏసీపీ ఆర్యన్ దేవ్ ( భరత్ నివాస్) హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ను అతడు ఛేధించిన తర్వాత ఈ దుర్ఘటన జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ సమయంలో అర్జున్ కి యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోతాడు. ఎలాగైనా గతాన్ని గుర్తుచేసుకొని ఆర్యన్ హత్యకు కారకుడు ఎవడో తెలుసుకోమని అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ మోహన్ (శ్రీకాంత్) అర్జున్ పై పదే పదే ఒత్తిడి చేస్తుంటాడు. అతను గతాన్ని మరచిపోయిన విషయాన్ని దాచిపెట్టి డ్యూటీలో చేరేట్టు చేస్తాడు. గతంలో అర్జున్– ఆర్యన్ దేవ్ – మోహన్ మంచి స్నేహితులు. తమ స్నేహితుడిని చంపిన వాడ్ని పట్టుకోవడానికి అర్జున్ –మోహన్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు ?, అసలు ఏసీపీ ఆర్యన్ దేవ్ ను చంపింది ఎవరు?, తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను మర్చిపోయిన అర్జున్ తన గురించి తాను తెలుసుకున్న నిజాలు ఏమిటి?, ఈ క్రమంలో అర్జున్ ఎలాంటి పరిస్థితుల్ని ఎదురుకోవాల్సి వచ్చింది ?, చివరకు ఈ కథలో మెయిన్ హంతుకుడు ఎవరు? ఇంతకీ అర్జున్ గత ఏమిటి? అతడెలాంటి వాడు? ఈ ముగ్గురి మధ్య ఉన్న స్నేహబంధాన్ని బ్రేక్ చేస్తూ ఆర్యన్ ను ఎవరు, ఎందుకు టార్గెట్ చేసి చంపేశారు? దాన్ని అర్జున్ ఎలా ఛేదించాడు? అన్నది తెలుసుకోవాలంటే ‘హంట్’ చూడాల్సిందే!

విశ్లేషణ : మనం ఇతర భాషా చిత్రాలు చూస్తూ ఇలాంటి సినిమాలు మనవాళ్ళు ఎందుకు తీయరని అనుకుంటూ ఉంటాం. అయితే అక్కడి కథ, కథనాలు ఎంత సహజంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందుకే మన వాళ్లు ఎక్కువగా అక్కడి సినిమాలను నచ్చి రీమేక్ చేస్తుంటారు. అందులో భాగంగానే దశాబ్దం క్రితం మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన ‘ముంబై పొలీస్’ను ‘హంట్’ రూపంలో ఇవాళ మన ముందుకు తెచ్చారు. ఈ చిత్రానికి ‘కథలో రాజకుమారి’ ఫేమ్ మహేష్ సూరపనేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓ మర్దర్ మిస్టరీ. పైగా పోలీస్ అధికారికి సంబంధించి పబ్లిక్ గా జరిగిన మర్డర్. ఇలాంటి కేసును ఛేదించే క్రమంలో ఆ పనిని స్వీకరించిన అర్జున్ కు ఎదురయ్యే ప్రశ్నలు.. వాటికి సంబంధించి లభించే జవాబులు సినిమా చూసే ప్రేక్షకులకు ఎంతో ఉత్కంఠను కలిగించి, ఆద్యంతం ఆసక్తి రీకెత్తించాలి. కానీ ఈ సినిమా సాగుతున్నంత సేపు అలాంటి ఉత్కంఠ.. ఆసక్తి ఏమాత్రం కనిపించలేదు. సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడిలో ఏదో తెలియని కాసింత నిరాశ..నిరుత్సాహం తొంగిచూస్తుంది. ప్రారంభం నుంచి ప్రీ క్లయిమాక్స్ వరకూ అదే వెలితి! మనకు ఓ థ్రిల్లర్ చూస్తున్నామనే భావన ఎప్పుడూ కలగదు. పైగా లేనిపోని సందేహాలు మాత్రం కలగడం సహజం. ఒక దశలో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. దర్శకుడు మహేష్ ఎంచుకున్న కథలో ట్విస్టులంటూ కానరాకపోగా.. కనీసం సన్నివేశాలకు లింకుగా మరో సన్నివేశం జత చేశాడంటే అదీ..లేదు! చివరకు అన్నీ ఫాల్స్ సస్పెక్ట్స్ కింద తేల్చేసాడు. ఇక అసలైన ట్విస్టును సినిమా ప్రీ క్లయిమాక్స్ లో రివీల్ చేశాడు.

అప్పటికే ఓపిక నశించిన ప్రేక్షకుడికి ఆ ట్విస్ట్ మరింత నిరాశను కలిగిస్తుంది. ఊహకందని వ్యక్తిని హంతకుడిగా ప్రేక్షకుల ముందు నిలిపినా , దానికి సరైన రీజన్ లేకపోయింది. ఆసక్తికరమైన క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే సింపుల్ గా సాగి చతికిలపడింది. సినిమాలో గుడ్ పాయింట్, చక్కటి కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ కూడా సింపుల్ గా నడిచింది. అలాగే సుధీర్ బాబు ప్లాష్ బ్యాక్ ట్రాక్ ఇంకా బలంగా ఉండాల్సింది. అదేవిధంగా భరత్ పాత్రను చంపే మోటివ్ ను కూడా దర్శకుడు మహేష్ ఇంకా బలంగా రాసుకోవాల్సింది. దీనికి తోడు సుధీర్ బాబు తాలూకు కొన్ని విచారణ సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా సాగాయి. మలయాళంలో ‘ముంబై పోలీస్’ సినిమాను చూసిన వారికి ఈ ‘హంట్’ ఏమాత్రం గొప్పగా అనిపించదు. స్క్రిప్ట్ లో చాలా తేడాలు కనిపిస్తాయి. అసలు ఆర్మీ అంటే ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అనేది ఏ మాత్రం రీసెర్చ్ చేయకుండా తీసిన హాఫ్ నాలెడ్జ్ సినిమా ఇది. ఆర్మీలో మేజర్ ర్యాంక్ అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్ లో జిల్లా ఎస్పీకి సమానమైన ర్యాంక్. మేజర్ పైన లెఫ్ట్ నెంట్ కల్నల్, ఆపైన కల్నల్ ఉంటారు. అంటే అది ఎంత పెద్ద ర్యాంకో కనీస అవగాహన లేకుండా సన్నివేశాలు పెట్టడం ఆశ్చర్యకరం. అలాగే ఒక ఆర్మీ ఆఫీసర్ “ఆర్మీ అంటే ఏంటో చూపిస్తా” అని పోలీసులకి ధమ్కీ ఇచ్చి లోకల్ గూండాలని వెనకేసుకొచ్చి ఫైటింగ్ చేయడమేంటో అర్థం కాదు. ఎంత “బాబు”గారి హీరోయిజం చూపించాలంటే మాత్రం మరీ ఇంత చీప్ గా తియ్యాలా? అలాగే టెర్రరిస్టులతో చేసే ఫైటింగుల్లో కూడా మాస్ హీరోయిజం చూపించుకోవాలనే తపన తప్ప ఏ మాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. దర్శకుడు మహేష్ మంచి క్రైమ్ థ్రిల్లర్ కి సంబంధించి గుడ్ పాయింట్ ను తీసుకున్నా.. స్క్రీన్ ప్లే ను మాత్రం బలంగా రాసుకోలేకపోయారు. సుధీర్ బాబు ప్లాష్ బ్యాక్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. ఇంత నీరసమైన కథనాన్ని భరించమంటే చాలా కష్టం!

నటీనటుల విషయానికొస్తే… మెమరీ లాస్ అయిన పోలీస్ అధికారిగా నటించిన సుధీర్ బాబు యాక్షన్ కొత్తగా ట్రై చేశాడు. అయితే.. యాక్షన్ ఎక్కువ.. కథనం తక్కువ ఉండడంతో అతడి సాహసం వృథాగానే మిగిలింది. యాక్షన్ సీక్వెన్సులు ఉన్నా ఎంత వరకు ఉండాలో, అంతే ఉంటే బావుంటుంది. అయితే సినిమా కోర్ పాయింట్ ఎమోషనే అయినప్పటికీ ఆ ఎమోషనే పూర్తిగా పేలవంగా తయారైంది. ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయంటే.. సినిమాలో ప్రేమకథ లేదు. ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. గతం మర్చిపోవడానికి ముందు… అర్జున్ ఎ క్యారెక్టర్ ఎలా ఉండాలో క్లియర్ గా ఉంది. గతం మర్చిపోయిన తర్వాత… అర్జున్ బి క్యారెక్టర్ కొంచెం కష్టం అయ్యింది. మెమరీ లాస్ మీద వచ్చిన ‘గజినీ’ లాంటి క్యారెక్టర్లకు పోలిక ఉండకూడదని ట్రై చేసినట్టు అనిపించింది.. సుధీర్ బాబు సీరియస్ పోలీస్ అధికారిగా తన నటనతో ఆకట్టుకున్నారు. సుధీర్ బాబు ఫిట్ నెస్ అండ్ మేనరిజమ్స్ బాగున్నాయి. క్రైమ్ అండ్ సీరియస్ సన్నివేశాల్లో సుధీర్ బాబు నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. కథ రీత్యా తన గురించి తాను నిజాలు తెలుసుకునే క్రమంలో సుధీర్ బాబు పడిన మానసిక వేదన, ఆ క్లిష్ట సన్నివేశాల్లో సుధీర్ బాబు పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి.

మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ నటన కూడా బాగుంది. తమిళ నటుడు భరత్ పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ తన నటనతో భరత్ ఆకట్టుకున్నాడు. భరత్ నివాస్, శ్రీకాంత్ తమ తమ పాత్రల్లో బాగానే ఒదిగారు. స్త్రీపాత్రలకు పెద్దగా స్కోప్ లేని ఈ సినిమాలో రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే శ్రీకాంత్ భార్య పాత్రకి, భరత్ వుడ్-బీ పాత్రకి డైలాగ్స్ పెట్టారు. మిగిలిన ప్యాడింగ్ ఆర్టిస్టులు ఓకే. మైమ్ గోపి, కబీర్ సింగ్, రవివర్మ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమా నిర్మాణ విలువలు, బీజీఎమ్ ఒకే.

సాంకేతిక విషయాలకొస్తే… అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ అరుల్ విన్సెంట్ చాలా సహజంగా చూపించారు. జిబ్రాన్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్ ఆకట్టుకుంది. మొత్తమీద మెప్పించని ఈ మర్డర్‌ మిస్టరీకి యాక్షన్ ఎక్కువ..కథనం తక్కువయింది. ఫలితంగా తేలిపోయింది.
-ఎం.డి అబ్దుల్

(చిత్రం : హంట్, విడుదల తేదీ : జనవరి 26, 2023, దర్శకత్వం : మహేష్ సూరపనేని, నిర్మాణం : భవ్య క్రియేషన్స్, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, సంగీతం : జిబ్రాన్, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, నటీనటులు : సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, చిత్ర శుక్లా, మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, అభిజీత్, మౌనికా రెడ్డి, జెమినీ సురేష్, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, కోటేష్ మన్నవ, సత్యకృష్ణ, రవివర్మ తదితరులు).

రేటింగ్:2.5/5