‘దోచేవారెవరురా’ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం : దోచేవారెవరురా, రేటింగ్: 3/5, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నాగేశ్వరరావు, నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు, సంగీత దర్శకత్వం : రోహిత్ వర్ధన్ – కార్తీక్, సినిమాటోగ్రఫీ: ఆర్లి, ఎడిటర్: శివ వై. ప్రసాద్, నటీనటులు: అజయ్ ఘోష్, చక్రి (చైల్డ్ ఆర్టిస్ట్), బిత్తిరి సత్తి, ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, బెనర్జీ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు తదితరులు.

తెలుగు చలన చిత్రసీమలో గొప్ప పేరున్న సీనియర్ దర్శకులు శివ నాగేశ్వరరావు. అలాంటి దర్శకుడి నుంచి కొంత విరామం తర్వాత ఓ చిత్రం వస్తుందంటే ఎవ్వరికైనా ఆసక్తే ఉంటుంది. అది ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి రేకెత్తించడం సహజమే! ఆయన నుంచి గతంలో వచ్చిన మనీ, సిసింద్రీ సినిమాలు ఎంతటి వినోదాన్ని పంచాయో ప్రేక్షకులు ఇంకా మరువలేదు. ఆయా చిత్రాల్లో ఉన్న కంటెంట్ లాంటిది మరి. ఆ చిత్రాల్లో ఆయన చూపిన ప్రతిభను ప్రేక్షకులు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. టాలీవుడ్ లో భారీ విజయాలు సొంతం చేసుకున్న అలాంటి సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తాజాగా తెరకెక్కించిన కామెడీ అండ్ యాక్షన్ చిత్రం ‘దోచేవారెవరురా’ మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? కొంతకాలా విరామం తర్వాత సీనియర్ దర్శకులు శివ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకొచ్చి ఎలాంటి వినోదాన్ని పంచాడు? తెలుసుకునే ముందు ఒక్కసారి రివ్యూలోకి వెళదాం…

కథ: సిద్దు సీనియర్ (ప్రణవ చంద్ర) సిద్దు జూనియర్ (చైల్డ్ ఆర్టిస్ చక్రి) తమ జీవనోపాధి కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో సీనియర్ సిద్దు, లక్కీ (మాళవిక సతీషన్)ని తొలి చూపులోనే ఇష్టపడి ఆమెతో ప్రేమలో పడడం, ఆపై ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుంది. అయితే లక్కీకి ఎదురైన పలు సమస్యలని పరిష్కరించేందుకు సిద్దు సహాయం చేస్తాడు. మధ్యలో విమల్ (అజయ్ ఘోష్) పీకే సత్తి (బిత్తిరి సత్తి)ని తన భార్య పార్వతి (ప్రణవి సాధనాల)ని హత్య చేయించేందుకు నియమిస్తాడు. అయితే పార్వతిని ఎందుకోసం విమల్ మర్డర్ చేయించాలనుకుంటాడు, మరి మధ్యలో సత్తికి సిద్దుకి ఉన్న సంబంధం ఏమిటి.. ఆపైన కథ ఏవిధంగా నడిచింది? అనేవి తెలియాలి అంటే ‘దోచేవారెవరురా’ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ: చాలా కాలం తరువాత మరొక్కసారి ఈ చిత్రం ద్వారా మంచి కామెడీ కథతో ప్రేక్షకులముందుకి వచ్చారు సీనియర్ దర్శకులు శివ నాగేశ్వరరావు. అలానే ఈ సినిమాలో విలన్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ప్రధాన చిత్రానికి ఎంతో బలంగా నిలిచాయి. ఇప్పటివరకు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన అజయ్ ఘోష్ ఈ ‘దోచేవారెవరురా’ చిత్రంలో హీరోగా కనిపించడంతో పాటు, ఒక డ్యూయల్ రోల్ కూడా పోషించడం విశేషంగా చెప్పుకోవాలి. సినిమా ద్వితీయార్ధంలో ఆయన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరించి, నవ్వుల్లో ముంచెత్తాయి. ఆ సీన్స్ అన్నీ ఎంతో బాగుంటాయి. పాటల రచయిత చైతన్య ప్రసాద్ కొడుకైన ప్రణవ చంద్ర, అలానే హీరోయిన్ మాళవిక సతీషన్ ఇద్దరూ కూడా తమ పాత్రల్లో ఎంతో వైవిధ్యాన్ని కనబరిచి ఆద్యంతం ఆకట్టుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి తన చురుకైన నటనతో అందర్నీ తన వైపునకు తిప్పుకున్నాడు. అతడి డైలాగ్ డెలివరీ అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుని మంచి కామెడీని పండించింది.ప్రణవి సాధనాల పాత్ర కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సెకండ్ హాఫ్ లోని పలు సన్నివేశాల్లో ఆమె పాత్ర వినోదాత్మకంగా సాగింది. ఇక ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రలకున్న పరిధిమేరకు నటించి వాహ్.. అనిపించారు.

మొత్తమీద ఈ ‘దోచేవారెవరురా’ చిత్రం అన్నివిధాలుగా ప్రేక్షకులకు నవ్వుల నజరాను అందించిందని చెప్పొచ్చు. కొంత విరామం తర్వాత దర్శకడు శివ నాగేశ్వరరావు మళ్లీ ఓ సక్సెస్ ని రుచి చూశారు అనే చెప్పాలి. నవతరానికి బాగా నచ్చే కథని తీసుకొని దానిని ప్రేక్షకులు మెచ్చేలా అందించి ఆసక్తికరంగా ముందుకు నడపడంలో ఎంతో చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఆర్లి అందించిన సినిమాటోగ్రఫీ, అలానే కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ అవి అందరికీ నచ్చేలా బాగున్నాయు. రోహిత్ వర్ధన్ అందించిన రెండు పాటలు ఒకే అనిపించేలా ఉన్నాయి. అంతే కాదు.. విజువల్ గా కూడా అవి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని ఆనందడోలికల్లో ముంచెత్తాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు చిత్రం స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ‘దోచేవారెవరురా’ చిత్రం కామెడీ సన్నివేశాలతో పాటు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని మెప్పించే విదంగా ఉందనే చెప్పాలి.