(చిత్రం : బిచ్చగాడు-2, విడుదల : 5, మే-2023, రేటింగ్ : 3/5, నటీనటులు: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, హరీష్ పెరడీ, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు, రాధా రవి తదితరులు. సినిమాటోగ్రఫీ : ఓం నారాయణ్, నిర్మాణం : విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని, సంగీతం-ఎడిటింగ్-రచన, దర్శకత్వం: విజయ్ ఆంటోనీ)
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బిచ్చగాడు -2’. ‘బిచ్చగాడు’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాతోనే విజయ్ ఆంటోనీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం వల్ల ‘బిచ్చగాడు -2’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ సరసన కావ్యథాపర్ హీరోయిన్‌గా నటించింది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంది? ‘బిచ్చగాడు -2’తో దర్శకుడిగా, హీరోగా విజయ్ ఆంటోనీకి విజయం దక్కిందా? లేదా? అన్నది తెలుసుసుందాం…
కథలోకి… లక్ష కోట్ల రూపాయల విలువైన బిజినెస్ సామ్రాజ్యానికి అధిపతి విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ). ఎంతో గొప్ప పేరున్న గురుమూర్తి దేశంలోనే రిచెస్ట్ బిజినెస్‌మెన్స్‌లో ఒకరిగా చెలామణి అవుతుంటాడు. అతడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతాడు అతడి స్నేహితుడు అరవింద్(దేవ్‌గిల్). అంతటితో ఆగక..విజయ్ గురుమూర్తి ఆస్తిపైనే కన్నేస్తాడు.ఇదిలా ఉండగా చిన్నతనంలోనే తనకు దూరమైన చెల్ల్లి కోసం అన్వేషిస్తుంటాడు సత్య (విజయ్ ఆంటోనీ). అతడు గంజాయి కేసులో ఇరవై ఏళ్లు జైలు శిక్షను అనుభవిస్తాడు .విజయ్ గురుమూర్తి, సత్య ఒకే పోలికలతో ఉంటారు. విజయ్ బ్రెయిన్‌లోకి సత్య బ్రెయిన్‌ను మార్చేస్తాడు అరవింద్. సత్య సహాయంతో విజయ్ ఆస్తిని కొట్టేయాలని పథకం వేస్తాడు కానీ బ్రెయిన్ మార్పిడి తర్వాత అరవింద్‌కు ఎదురు తిరిగిన సత్య అతడిని చంపేస్తాడు. అతడు అలా ఎందుకు చేశాడు? బిచ్చగాళ్ల కోసం యాంటీ బికిలీ అనే పథకాన్ని ఎందుకు ప్రారంభించాడు? సత్య మంచి పనికి ముఖ్యమంత్రి ఎందుకు అడ్డుచెప్పాడు? విజయ్ ప్లేస్‌లోకి సత్య వచ్చిన విషయాన్ని పోలీసులతో పాటు అతడి ప్రియురాలు హేమ (కావ్యా థాపర్) కనిపెట్టిందా? బ్రెయిన్ మార్పిడి కేసులొ సత్య దోషిగా జైలుకు వెళ్లాడా? లేదా? సత్య చెల్లెలు దొరికిందా? లేదా? అన్నదే స్థూలంగా ఈ సినిమా కథ.
విశ్లేషణ : విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చి ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీగా నిలిచి హీరోగా విజయ్ ఆంటోనీకి ఎనలేని పేరుప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలోని మదర్ సెంటిమెంట్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు -2’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. అయితే.. ఈ చిత్రం పేరుకే సీక్వెల్ గానీ ఆయా చిత్రాల్లోని రెండు కథలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ‘బిచ్చగాడు’ సెంటిమెంట్‌కు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే.. సీక్వెల్ గా వచ్చిన ‘బిచ్చగాడు-2’ మాత్రం బ్రెయిన్ మార్పిడి అనే ప్రయోగాత్మక పాయింట్‌కు యాక్షన్ అంశాలను జోడించి తెరకెక్కించారు. ఎంచుకున్న కథను చివరి వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు విజయ్ ఆంటోనీ. బ్రెయిన్ మార్పిడి తర్వాత విజయ్ ప్లేస్‌లోకి వచ్చిన సత్యం ఏం చేయబోతున్నాడన్నది ఊహలకు అందకుండా చక్కటి మలుపులతో స్క్రీన్‌పై అంతే చక్కగా .. ప్రేక్షకులు మెచ్చేలా ఆవిష్కరించి మంచి మార్కుల్ని కొట్టేశారు. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడిని ఆలోచనలోకి నెట్టేస్తుంది. సన్నివేశంలో అంతలా లీనమయ్యేలా చేస్తుంది. విజయ్ గురుమూర్తి, సత్య నేపథ్యాలు, బ్రెయిన్ మార్పిడి అంశాలతో ఫస్ట్ హాఫ్‌ను ఎంగేజింగ్‌గా నడిపించారు. యాంటీ బికిలీ స్కీమ్ మొదలుపెట్టి బిచ్చగాళ్లకు సత్య సహాయం చేయడం, ప్రభుత్వం అతడిపై కక్ష కట్టే సన్నివేశాలతో సెకండాఫ్‌ను ఎంతో అందంగా.. హృదయానికి అత్తుకునేలా అల్లుకున్నారు.అయితే.. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న వేగం సెకండాఫ్‌లో కొంత మేరకు మందగించింది. బిచ్చగాళ్లకు సత్య సహాయం చేసే సన్నివేశాలు బోరింగ్‌సాగాయి. సిస్టర్ సెంటిమెంట్‌లో ఎమోషనల్ కనెక్టివిటీ కొంచెం మిస్సయింది. థ్రిల్లర్ కథలో బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో ఎక్కువ లేయర్స్ ఉండటంతో దర్శకుడిగా విజయ్ ఆంటోనీ కాస్త కన్ఫ్యూజ్ అయినట్లుగా ప్రేక్షకుడికి అనిపిస్తుంది. విజయ్ గురుమూర్తికి షాడోగా ఉండే ప్రియురాలు హేమను అతడి నుంచి విడదీసే కుట్రతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. విజయ్ గురుమూర్తిని తమ చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకొనేందుకు బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాన్సెప్ట్‌గా కొత్తగా ఉండటంతో.. కథతో ట్రావెల్ అయ్యేలా చేసింది. అయితే సినిమాకు క్లైమాక్స్ అనుకునే పాయింట్‌ను ఇంటర్వెల్‌లోనే ముగించడంతో.. సెకండాఫ్‌లో ఏ చేస్తాడనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో విజయ్ గురుమూర్తిలా కాకుండా సత్యలా బిహేవ్ చేయడంతో కథ మరో కోణంలో కొనసాగుతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ మరీ సాగదీసి.. విసుగు పుట్టించేలా చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బిచ్చగాళ్లకు సంబంధించిన డిటేయిలిటీ కాస్త ఎక్కువగా అనిపించడం బోర్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ముందు ఏపీ సీఎంతో సత్య అమీతుమీకి తేల్చుకొనేందుకు సిద్దం కావడం, సీఎం మనుషులతో ఫైట్‌తో కథ ఊపందుకోవడమే కాకుండా మరో రేంజ్‌కు వెళ్తుంది. ఈ సినిమాను క్లైమాక్స్ మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. విజయ్ ఆంటోని వన్ మ్యాన్ షో..:కథకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా విజయ్ ఆంటోని వన్ మ్యాన్ షో. కథను నడిపించిన విధానం, కథలో సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించిన విధానం సినిమాకు హైలెట్‌గా మారిందని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే… విజయ్ గురుమూర్తి, సత్యగా డిఫరెంట్ షేడ్స్‌తోకూడిన క్యారెక్టర్‌లో విజయ్ ఆంటోనీ నటన బాగుంది అని అనడంకంటే.. ఆయా రెండుపాత్రల్ని తనదైన స్టయిల్ లో ఇరగదీశాడని చెప్పొచ్చు. పాజిటివ్, నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాత్రల్లో విజయ్ ఆంటోనీ నటన బేషుగ్గా ఉంది. ఆద్యంతం అతడి క్యారెక్టర్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. హీరోగానే కాకుండా, దర్శకుడిగా ఫస్ట్ సినిమాతోనే మంచిపేరును తన ఖాతాలో వేసుకున్నాడు. సత్యగా ఎమోషనల్ క్యారెక్టర్‌ను పండించిన విధానం నటననపరంగా విజయ్ ఆంటోనికి ఉన్న తపన కనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్లను చిత్రీకరించిన విధానం దర్శకుడిగా ఆయన ప్రతిభ మాత్రమే కాకుండా ఆడియెన్స్ పల్స్ తెలుస్తుంది. చివరి నిమిషాల్లో ఆయన నటన ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. అతడు అందించిన సంగీతం కూడా సినిమాకు బాగానే ప్లస్సయింది. గురు మూర్తి, సత్య పాత్రల చుట్టూ తిరిగే పాత్రలు నామమాత్రంగానే కనిపిస్తాయి. తన క్యారెక్టర్‌ను విజయ్ ఆంటోని బలంగా రాసుకోవడం వల్ల మరే పాత్రలు కూడా బయటకు ఎలివేట్ కాలేకపోయాయి. ప్రియురాలిగా కావ్య థాపర్ ఒకట్రెండు సీన్లలో మెప్పించింది. ఉన్నంతలో ఆమె నటనకు మంచి మార్కులనే వేయొచ్చు. సీఎంగా రాధారవి ఫర్వాలేదనిపిస్తారు. హరీష్ పేరడి, జాన్ విజయ్, దేవ్ గిల్ ఓకే అనిపిస్తారు. చెల్లెలు క్యారెక్టర్ చేసిన యాక్టర్లు ఇద్దరు ఆకట్టుకొంటారు.
టెక్నీకల్ అంశాలను పరిశీలిస్తే… ముందుగా చెప్పుకోవలసింది ‘బిచ్చగాడు ‘2 సినిమాకు ఓం నారాయణ్ అందించిన సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. హై క్వాలిటీతో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతీ సన్నివేశాన్ని చాలా రిచ్‌గా, అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఫైట్స్ చిత్రీకరించిన విధానం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సెకండాఫ్‌లో బిచ్చగాళ్ల సమావేశం సీన్ సూపర్ గా ఉంది. విజయ్ ఆంటోనీ ఎడిటింగ్, మ్యూజిక్ అన్నీ విభాగాలపై ఆయన కమాండ్ కనిపిస్తుంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా బిచ్చగాడు 2 ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశకు గురిచేయదు. ప్రథమార్థం మంచి ఫీల్ కలిగిస్తే.. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు గుండెను పిండేసే ఎమోషన్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది.