Bhimaa Movie Review: భీమా మూవీ రివ్యూ: మాస్ కు మాత్రమే…!

(చిత్రం : భీమా, విడుదల తేదీ : మార్చి 08, 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు, దర్శకత్వం: ఏ హర్ష, నిర్మాత: కేకే రాధామోహన్, సంగీత దర్శకులు: రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్‌: స్వామి జె గౌడ, ఎడిటింగ్: తమ్మిరాజు)

కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన చిత్రం ‘భీమా’. చిత్రం విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ గా మేకర్స్ చెప్పుకున్నారు. ఎన్నో అంచానాలతో నేడు (మార్చి 08, 2024,) ప్రేక్షకుల ముందుకి వచ్చిందీచిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం….

కథ : పోలీస్ అధికారి భీమా (గోపీచంద్). క్రిమినల్స్ ని పట్టుకుని వారి ఆట కట్టించే పోలీస్ అధికారిగా తనదైన స్టయిల్ లో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో మహేంద్రగిరిని ఏలుతున్న భవాని (ముకేశ్ తివారి) కి భీమా పెద్ద సమస్యగా మారతాడు. ఒకానొక సమయంలో స్కూల్ టీచర్ గా పని చేస్తున్న విద్యతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు భీమా. అయితే తన మందులతో ఎందరినో కాపాడుతున్న రవీంద్ర వర్మ (నాజర్) అంటే విద్యకు అమితమైన గౌరవం ఉంటుంది. అనంతరం భీమాని రవీంద్ర వర్మ ఒక పనిచేయమని కోరతాడు. అదే పలు పరిస్థితులకు దారి తీస్తుంది, మరి ఇంతకీ భీమాని రవీంద్ర వర్మ కోరింది ఏంటి. భవాని కి భీమాకి మధ్య ఏమి జరిగింది, రవీంద్ర వర్మ అప్పగించిన పనితో భీమా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, చివరికి ఏమి జరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: గోపీచంద్ నటించిన తాజా చిత్రం భీమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా, దర్శకుడు ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్‌తో సెకండ్ హాఫ్ ని బాగానే నడిపించాడు. ఇటీవల వస్తున్న పలు సినిమాల మాదిరిగా మంచి యాక్షన్ సీన్స్, విజువల్స్ తో కూడిన కథగానే భీమా కూడా సాగుతుంది. పరశురాముని క్షేత్రం గురించి తెలుపుతూ వచ్చే వాయిస్ ఓవర్ తో ఈ మూవీ ప్రారంభం అవుతుంది. ఇక మొదటి 15 నిముషాలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు మున్ముందు కథ పై మంచి ఆసక్తిని ఏర్పరుస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఎంతో బాగుండడంతో పాటు సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని ఏర్పరుస్తుంది. ఈ సీనిమా మొత్తంగా యాక్షన్ మాస్ డ్రామాగా సాగిందని చెప్పాలి. గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన.. ఫాంటసీ ఎలిమెంట్. మాస్ అంశాలు, చివరి అరగంట, ఇంటర్వెల్ సీక్వెన్స్ .. రిచ్ విజువల్స్ భీమా మెయిన్ హైలైట్స్ గా చెప్పుకోవాలి. అయితే కొంత వల్గర్ గా అనిపించే లవ్ ట్రాక్, కొన్ని డైలాగ్‌లు సినిమాని కొందరికే పరిమితం చేస్తుంది. కోర్ పాయింట్‌ని హైలైట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. దానిని మరింత ఎలివేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, భీమా విషయంలో దర్శకుడు పూర్తి స్థాయి సంతృప్తిని అందించలేదు. ఇటీవల కాలంలో గోపీచంద్ నటించిన మంచి మాస్ యాక్షన్ పాత్రల్లో భీమా ఒకటి. దీనిని దర్శకుడు హర్ష చక్కగా రాసుకున్నారు. మంచి ఇంట్రడక్షన్ సీన్ అనంతరం కథనం మెల్లగా సాగుతుంది. అనంతరం వచ్చే లవ్ ట్రాక్ తో పాటు మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్న కొన్ని వల్గర్ సీన్స్ అయితే కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటాయి. బ్యాక్ అండ్ ఫార్త్ స్టైల్ స్క్రీన్‌ప్లే అతిగా ఉపయోగించడం అనుసరించడంతో ఆడియన్స్ కి దానిని అర్ధం చేసుకోవడం కొంత ఇబ్బందిగా అనిపించి గందరగోళం ఏర్పడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా భీమా పాత్ర పై నడిపించారు, అయితే అందులో లవ్ ట్రాక్ ఎక్కువగా ఉండడం పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఐతే కథ లోని మెయిన్ పాయింట్ ని ఇంటర్వెల్ బ్లాక్ కి వచ్చే వరకు చూపించకపోవడం కూడా కొంత డ్రా బ్యాక్ అని చెప్పాలి. అనంతరం సెకండ్ హాఫ్ కోసమే ఎక్కువగా ఎదురుచూసేలా రాసుకున్నారు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ కావు.

ఎవరెలా చేశారంటే… హీరో గోపీచంద్ కూడా ఆ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. ఇక తన పాత్రలో ఉన్న మరొక కోణాన్ని సైతం గోపీచంద్ సూపర్ గా ప్రదర్శించి ఆడియన్స్ ని అలరించారు. హీరోయిన్ మాళవిక పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో ఆమె సీన్స్ మరింత బాగున్నాయి. నరేష్, ముఖేష్ తివారీ, రఘుబాబు, చమ్మక్ చంద్ర తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు. ఇక మూవీలో లాస్ట్ అరగంట అయితే ఎంతో బాగుంటుంది. ఎమోషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్‌లు, కీలకమైన ట్విస్ట్ తోపాటు .. హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు చక్కగా కుదిరాయి మరియు వీటి కారణంగా సీన్స్ బాగా పండుతాయి. వెన్నెల కిషోర్ మరియు రోహిణి పాల్గొన్న కొన్ని కామెడీ మూమెంట్స్ బాగా వచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా తెరకెక్కించారు. రవి బస్రూర్ అందించిన ఇంపాక్ట్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైవోల్టేజ్ సీన్‌లను మరొకస్థాయికి తీసుకువెళ్లింది.

సాంకేతిక వర్గం : ముందుగా చెప్పుకోవలసింది సినిమాటోగ్రఫీ గురించి. స్వామి జె గౌడ అద్భుతంగా పని చేసారు, ముఖ్యంగా నైట్ సీన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. మంచి మాస్ సినిమాకి కావాల్సిన యాక్షన్ సీన్స్ బీమాలో బాగా సెట్ అయ్యాయి. యాక్షన్ తో కూడిన కథలో మంచి ఫాంటసీ ఎలిమెంట్ ని జొప్పించి దర్శకుడు ఏ హర్ష దీనిని బాగానే తెరకెక్కించారు. మాస్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ పోర్షన్స్ ఎంతో బాగున్నాయి. గోపీచంద్ యాక్టింగ్ సూపర్ అని చెప్పాలి. అయితే లవ్ ట్రాక్ సీన్స్ డిజప్పాయింట్ చేస్తాయి. అలానే కొంత స్క్రీన్ ప్లే కూడా ఆడియన్స్ కి గందరగోళంగా అనిపిస్తుంది. మొత్తం మీద ఈ ‘భీమా’ మాస్ కు మాత్రమే…!