Anveshi Movie Review In Telugu : ‘అన్వేషి’ రివ్యూ & రేటింగ్…

(చిత్రం : అన్వేషి, విడుదల తేదీ : నవంబర్ 17, 2023 రేటింగ్ :3.25/5, నటీనటులు: అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు, దర్శకత్వం : వీజే ఖన్నా, నిర్మాత: గణపతి రెడ్డి, సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్, సినిమాటోగ్రఫీ: కెకె రావు,
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్).

విజయ్ ధరణ్ దాట్ల హీరోగా సిమ్రాన్ గుప్తా హీరోయిన్ గా వచ్చిన సినిమా అన్వేషి. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు వచ్చింది.. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం….

కథ : డాక్టర్ అను (అనన్య నాగళ్ళ) తన తండ్రి కోరిక మేరకు సొంతూరులో అను హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవ చేస్తోంది. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అను హాస్పిటల్ అగ్ని ప్రమాదంలో తగలబడి, డాక్టర్ అను, ఆమె తండ్రి చనిపోతారు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అను హాస్పిటల్ చుట్టూ వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో విక్రమ్ (విజయ్ ధరణ్ దాట్ల) ఆ హత్యల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంతకీ ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ?, ఈ మధ్యలో అను (సిమ్రాన్ గుప్తా)తో విక్రమ్ ప్రేమ కథ ఎలా సాగింది ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ : ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథనంతో ‘అన్వేషి’ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ముఖ్యంగా క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్‌గా సాగితేనే ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఈ థ్రిల్లింగ్‌’అన్వేషి’లో మనకు కనిపిస్తుంది. . థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను దర్శకుడు కొన్ని బలమైన క్రైమ్ మూమెంట్స్ పెట్టి మంచి డ్రామా రాబట్టే ప్రయత్నం చేశాడు. విలన్ పెద్దిరెడ్డి క్యారెక్టర్ ఎండింగ్ ను మరింత ఆసక్తికరంగా మలిచి ఉండాల్సింది . అదే విధంగా రెగ్యులర్ కామెడీతో అక్కడక్కడా నవ్వించినా.. చాలా సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదేమో అనిపిస్తుంది. ప్రధాన పాత్రల మధ్య ఉన్న కామెడీ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ ను వాడుకోలేదు.

నటీనటులు ఎలా చేశారంటే… ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన విజ‌య్ ధ‌ర‌ణ్‌, సిమ్రాన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల చక్కటి నటన కనబరిచారు. ముఖ్యంగా నటుడు అజయ్ ఘోష్ తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హీరోగా విజ‌య్ ధ‌ర‌ణ్‌ చాలా కాన్ఫిడెంట్ గా నటించారు. ఇక సినిమాలో అడవి నేపథ్యంలో నడిచే సన్నివేశాలు.. అదే విధంగా అను హాస్పిటల్ చుట్టూ జరిగే హత్యలు, ఆ హత్యల వలయాన్ని చేధించడానికి హీరో ప్రయత్నించే సన్నివేశాలు, ఈ క్రమంలో సాగే డ్రామా ఆసక్తి గొలుపుతుంది. ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తిస్తుంది. హీరోయిన్ సిమ్రాన్ గుప్తా తన అందంతో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. అన‌న్య నాగ‌ళ్ల కూడా మెప్పించింది. కానీ ఆమె పాత్రకు ఎక్కువ నిడివి లేదు. ఉన్నంతలో ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే క్రైమ్ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. రచ్చ రవి, దిల్ రమేష్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం : సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ప్రతీ సన్నివేశం ఆకట్టుకునే రీతిలోనే తెరకెక్కింది. అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను.. అలాగే క్లైమాక్స్ లోని యాక్షన్ కంటెంట్ ను దర్శకుడు వీజే ఖన్నా బాగా తెరకెక్కించాడు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెకె రావు సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయింది. నిర్మాత గణపతి రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి. మొత్తం మీద ఈ ‘అన్వేషి’ క్రైమ్ సస్పెన్స్ డ్రామాతో సాగి ఆకట్టుకునే విధంగానే ఉంది.