Agent Movie Review : ‘ఏజెంట్‌’ సినిమా ఎలా ఉందంటే?

(చిత్రం: ఏజెంట్, విడుదల తేది: 28 ఏప్రిల్-2023, రేటింగ్ : 2/5, నటీనటులు: అఖిల్ అక్కినేని, మ్ముట్టి, సాక్షి వైద్యా, డినో మోరియా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు. సంగీతం: హిప్ హాప్ తమీజా సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, నిర్మాత: రామ బ్రహ్మం సుంకర, దర్శకత్వం: సురేందర్ రెడ్డి, నిర్మాణం : ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా)

టాలీవుడ్ నవతరం హీరో అఖిల్ అక్కినేనికి ఎందుకనో కెరీర్ లో నిలదొక్కుకునేందుకు కాలం కలసిరావడం లేదు. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంటనే వరుసగా మూడు పరాజయాలను చవిచూశాడు. అతడి గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఫర్వాలేదనిపించిన అఖిల్ తన కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశాడు. తన ఆశలన్నీ తాజా చిత్రం ‘ఏజెంట్’ పైనే పెట్టుకున్నాడు. తన సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రేక్షకులను అఖిల్ అలరించే ప్రయత్నం చేశాడు. ‘సై రా నరసింహా రెడ్డి’ ఫేమ్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళం స్టార్ మమ్ముట్టి కూడా ఈ ‘ఏజెంట్’ లో కీలక పాత్రని పోషించారు.

సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు అనగా ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ద్వారా అఖిల్ అక్కినేని ఎలాంటి విజయాన్ని అందుకున్నాడు? సినిమా అంచనాలను అందుకుందా? లేదా? తెలుసుకుందాం…

కథ: అనగనగా అఖిల్ (అక్కినేని అఖిల్) అనే యువకుడు. రా ఏజెంట్ అవ్వాలని ఎప్పటినుంచో కలలు కంటూ ఉంటాడు. అందుకోసం అతడు చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోతుంటాయి, రా ఏజెంట్ అవ్వాలంటే మాటలుకాదు.. చేతలు కావాలి. అలాంటి చేతలన్నీ తనవద్ద ఉన్నాగానీ ఎందుకనో ఆ అడుగులు విఫలమవుతుంటాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక ఫేమస్ రా ఏజెంట్.. పేరు డెవిల్ (మమ్ముట్టి) వద్దకు వెళ్తాడు. ఆ డెవిల్ కి ఇండియాలో ఒక సిండికేట్ ను రన్ చేసే గాడ్ (డినో మోరియో)తో గొడవలు ఉంటాయి. గాడ్ ని తుదముట్టించడానికి డెవిల్ ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇంతకీ డెవిల్ మరియు గాడ్ కి మధ్య గొడవలు ఎందుకు ఏర్పడ్డాయి? రా ఏజెంట్ అవ్వడానికి అఖిల్ కు డెవిల్ ఈ విధంగా ఉపయోగపడ్డాడు? తను అనుకున్నట్లు అఖిల్ రా ఏజెంట్ అవ్వగలిగాడా? లేదా? డెవిల్ గాడ్ మధ్యలో ఎవరు గెలిచారు? చివరికి ఏమైంది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ: మామూలుగా మొదలయిన సినిమా ఫస్ట్ హాఫ్ లోని సన్నివేశాలు అన్నీ ఇంతకుముందు ఏదో సినిమాలో చూసినట్లుగానే కనిపిస్తాయి. రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మేట్ లోనే ఈ సినిమా మొత్తం సాగింది. . స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది. ట్రైలర్ లో అఖిల్ పాత్ర చెప్పినంత వైల్డ్ గా సినిమా అయితే లేదు. ఇంటర్వెల్ సీన్ ఫర్వాలేదు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే బోరింగ్ గా రెగ్యులర్ ఫార్మేట్ లోనే నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి బోరింగ్ కమర్షియల్ సినిమా రాలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఎవరెలా చేశారంటే.. : ఈ చిత్రం కోసం అఖిల్ అక్కినేని బాగా కష్టపడ్డాడని చెప్పొచ్చు.అందుకు అతడు ఒక వైల్డ్ మేక్ ఓవర్ చేశాడు. పొడుగు జుట్టు, సిక్స్ ప్యాక్ లుక్ అఖిల్ కి బాగా సూట్ అయ్యాయి. వెండి తెర మీద అఖిల్ సరికొత్త అవతారంలో కనిపించాడు. యాక్షన్ సన్నివేశాలలో తో పాటే రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటన పరంగా కూడా మంచి మార్కులే వేయొచ్చు. సీనియర్ నటుడు మమ్ముట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పాత్రలు అతడికి కొట్టిన పెండే. మమ్ముట్టి కి ఈ సినిమాలో కీలకమైన పాత్ర లభించింది. ఎప్పటిలాగానే తన చక్కటి పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. కథానాయికగా నటించిన సాక్షి వైద్య గ్లామర్ గా కనిపించి మెప్పించింది. కాకపోతే.. ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత ఉన్నట్టు కనిపించలేదు. ఉన్నంతలో ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. నటనాపరంగా ఒకే అనిపించింది. ఇక గాడ్ గా నటించిన డినో మోరియా తొలిసారిగా ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆయన పాత్ర అనుకున్నంత లేకపోయినప్పటికీ నటనపరంగా ఇరగదీశాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నీకల్ విషయాలకొస్తే… దర్శకుడు సురేందర్ రెడ్డికి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చేయడంలో గొప్ప పేరే ఉంది. అలాంటి చిత్రాలు తెరకెక్కించడంలో ఆయనది విభిన్నమైన శైలి అంటుంటారు. ‘ఏజెంట్’ విషయంలో కూడా సురేందర్ రెడ్డి తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలను విభిన్నంగానే ప్రెజెంట్ చేశారు. అయితే… యాక్షన్ సన్నివేశాలపైన పెట్టిన శ్రద్ద కాస్త కథమీద పెట్టివుంటే బావుండేది. స్క్రీన్ ప్లే సైతం నీరసంగా ఉంది. ఫారిన్ లొకేషన్ ల మీద పెట్టిన ఫోకస్.. కథ మరియు స్క్రీన్ ప్లే మీద మాత్రం పెట్టలేకపోయారు. కథలో కొత్తదనమే కనిపించదు. రొటీన్ అవుట్ డేటెడ్ కథ. స్క్రీన్ ప్లే కూడా చాలా వరకు స్లోగా ఉండటంతో సినిమా చూసే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సంగీతం ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్ గానే చెప్పుకోవాలి. పాటలు అంతంతమాత్రమే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా కోసం మంచి లోకేషన్లను ఎంచుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తం మీద అఖిల్ విభిన్నమైన లుక్ విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ బాగున్నప్పటికీ.. కథ స్క్రీన్ ప్లే బోరింగ్ నెరేషన్ తో సినిమా ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయింది.