తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలనే కోరికైతే ఉంది కానీ అందుకు అవసరమైన సఖ్యత, ఐకమత్యం లేనేలేవు. పార్టీలోని నేతలు ఎవరి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. అందరివీ సొంత రాజకీయాలే తప్ప కలిసికట్టుగా ఒక్క పనీ చేయరు. హైకమాండ్ దిగి ఇలా చేయండి అలా చేయండి అంటూ ఆజ్ఞాపిస్తేనే అందరూ ఒక వేదిక మీదకు వస్తారు. లేకుంటే పీసీసీ చీఫ్ పదవి కోసం వాళ్లలో వాళ్ళే కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ అంతర్గత కుట్రలకు ఎక్కువగా ఇబ్బందిపడింది రేవంత్ రెడ్డి. పార్టీలోకి వచ్చిన కొత్తలో సీనియర్ల అసహనం తట్టుకుపోలేకపోయిన ఆయన మెల్లగా అర్థంచేసుకుని ఇప్పుడు తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. రేవంత్ పనితనానికి ఫలితంగా ఆయనకు రావాల్సిన గుర్తింపు ఆయనకు వస్తోంది.
ఇలాంటిదే విజయశాంతి గారిది కూడ. కొన్నేళ్లపాటు పార్టీకి దూరంగా ఉన్న ఆవిడ ఇటీవలే యాక్టివ్ అయ్యారు. పార్టీ పెద్దలు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమెను బ్రతిమాలి మరీ జనంలోకి తీసుకొచ్చారు. అయితే వచ్చారన్న మాటే కానీ ఆమెలోని పాత అసంతృప్తి ఇంకా అలాగే ఉంది. గతంలో ఎలాగైతే సొంత పార్టీ నేతలే తనకు చెక్ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారో ఇప్పుడు కూడ అదే తరహాలో ఆరోపణలు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదట ఆమెను బరిలోకి దింపాలని చూశారు. కానీ రాములమ్మ ఒప్పుకోలేదు. దీంతో నేతలు కూడ వదిలేశారు. ఎన్నికలకు ఇంకొన్ని రోజులే ఉందనగా ఆమె మళ్ళీ పాత పాటే అందుకున్నారని, పార్టీ మారడానికి చూస్తున్నారని వార్తలు వచ్చాయి.
కానీ అవేవీ నిజం జరగలేదు. అయితే ఆమెలో మాత్రం అసంతృప్తి అలాగే ఉందని మాత్రం అర్థమవుతూనే ఉంది. ఇదంతా చూస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా ఎన్నాళ్లిలా అసంతృప్తితో రగిలిపోతూ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇలాగే ఉంటే పార్టీ కోసం ఏం పనిచేస్తారు. నిజమే కాంగ్రెస్ సీనియర్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అలాగని ఆగిపోతే ఎలా. అవతల రేవంత్ రెడ్డిని చూడండి. సీనియర్లతో పని కాదని తెలుసుకుని సొంతగా దూసుకుపోతున్నారు. తన శక్తిమేర కష్టపడుతున్నారు. అంతేకానీ చీటికీ మాటికీ అలగడాలు, నేతల మీద విమర్శలతో సరిపెట్టడాలు చెయ్యట్లేదు. మీరు కూడ ఆయనలాగే సొంత ఎజెండాతో ముందుకెళ్ళండి. లేకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచినా అలా అసంతృప్తితో మిగిలిపోవాల్సిందే అంటూ సలహా ఇస్తున్నారు.