మీడియా ముందుకొచ్చిన టిఆర్ఎస్ తుల ఉమ

గత రెండు మూడు రోజులుగా కరీంనగర్ జెడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె శనివారం తెలంగాణ భవన్ లో మీడియా ముందుకు వచ్చారు. తన మీద జరుగుతున్న ప్రచారంపై ఆమె వివరణ ఇచ్చారు. ఆమె ఏమన్నారో చదవండి.

రెండు మూడు రోజులుగా నా పై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. నేను అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాను. ఆ తర్వాత కేసీఆర్ అలుపెరుగని పోరాటంలో కార్యకర్తగా పనిచేశాను. 

నేను వేములవాడ టికెట్ ఆశించడం లో తప్పు లేదు. సిట్టింగ్ లకు అవకాశం ఇవ్వడం తో నాకు టికెట్ రాలేదు. కార్యకర్తగా టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నేను టికెట్ అడగడం నా హక్కు. ఇది మా కుటుంబ సమస్య. మా పార్టీ వ్యవహారం మాత్రమే. 

నాపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. నాకు చాలా భాధ కలిగించింది. మళ్లీ తెలంగాణలో టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్న భయంతో …మా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారుతున్నాను అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను.

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రాబోతున్నది. టి ఆర్ ఎస్ నాకు పుట్టినిల్లు. ఈ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తనపై లేనిపోని ప్రచారం చేయవద్దని వేడుకుంటున్నాను.