మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారంటూ గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి చేసిన కామెంట్స్ మెదక్ రాజకీయాల్లో సంచలనం రేపాయి. సోనియా గాంధీ సమక్షంలో హరీస్ రావు నెలరోజుల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు వంటేరు ప్రకటించారు.
వంటేరు వ్యాఖ్యలపై టిఆర్ఎస్ సిద్ధిపేట ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. గజ్వెల్ లో ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చేసిన ఆరోపణలు ప్రతాప రెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. అలా నిరూపిస్తే తాను గజ్వెల్ అంబేద్కర్ చౌరస్తాలో ఆత్మ బలిదానానికి సిద్ధం అని ప్రకటించారు.
ఒకవేళ వంటేరు ప్రతాప రెడ్డి 24 గంటల్లో గా నిరూపించకపోతే ఆయన దేనికి సిద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. వంటేరు ప్రతాప రెడ్డి నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
టివిల్నులో ఏదో ఒకటి మాట్లాడితే హైలెట్ అవుతానని అనుకుంటే అందుకు గజ్వేల్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వంటేరు ప్రతాపరెడ్డి చరిత్ర మొత్తం గజ్వేల్ ప్రజలకు తెలుసు అన్నారు. రానున్న ఎన్నికల్లో వంటేరు ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.