శవానికి పోస్టుమార్టం చేయించడానికి సిద్ధపడిన పోలీసులు… శవాన్ని భుజాన పెట్టుకొని పరుగు పెట్టిన వ్యక్తి..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పోస్టుమార్టం నిర్వహించొద్దు అంటూ బంధువుల ఆందోళన చేశారు. అనంతరం శవాన్ని భుజం మీద వేసుకొని ఒక వ్యక్తి అక్కడి నుండి స్మశానం వైపు పరుగు తీసిన ఘటన చర్చాంశనీయంగా మారింది . అయితే పోలీసుల అతనిని వెంబడించి ఎట్టకేలకు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు… జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 65 సంవత్సరాల జడల మల్లయ్య అనే వ్యక్తి గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున లేపిన కూడా అతను స్పందించకపోవడంతో అనుమానం వచ్చి చూడగా అప్పటికే మల్లయ్య మరణించి ఉన్నాడు. దీంతో ఆమె వెంటనే భర్త మరణించిన సంగతి కుటుంబ సభ్యులకి తెలపగా వారు చేసేదేం లేక అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

అయితే మల్లయ్య అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అంతక్రియలను ఆపి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్లకు పంపవలసినదిగా కుటుంబ సభ్యులకు తెలిపారు. అందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఇంతలో మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహాన్ని తన భుజాలపై వేసుకొని మల్లయ్య మృతి పైన తమకు ఎటువంటి అనుమానం లేదని, ఆయన గుండెపోటుతోనే మరణించాడని అరుచుకుంటూ స్మశానం వైపు పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అతని వెంబడించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మల్లయ్య మృతి ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు గారు తెలిపారు.