కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కోస్గి మండలం నాగులపల్లిలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో నలుగురు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాడులతో పోలీసులు అప్రమత్తమయ్యి అదనపు బలగాలను గ్రామానికి రప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
నాగులపల్లిలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైన రెండు గంటల పాటు పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. పోలింగ్ బూత్ వద్ద టిఆర్ఎస్ కార్యకర్తలు కారు గుర్తుకే ఓటు అంటూ ఓటర్ల వెంట పడి అరుస్తున్నారు. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుచెప్పారు. అయినా కూడా వారు వినకుండా అదే విధంగా ప్రవర్తించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెయ్యి గుర్తుకే మన ఓటు అంటూ ఓటర్లకు చెప్పారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు వారిని పోలింగ్ సెంటర్ నుంచి పంపించి వేశారు.
గ్రామంలోని వారి ఇండ్లకు వెళ్లిన టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల ఇండ్లలోకి వచ్చి మళ్లీ గొడవపడ్డారు. దాదాపు నలుగురు కార్యకర్తల ఇండ్లలో ఏక కాలంలో చొరబడి వారి పై దాడులు చేశారు. దాడుల విషయం తెలుసుకున్న మరికొంత మంది కాంగ్రెఃస్ కార్యకర్తలు ఘటనా స్థలానికి వచ్చి టిఆర్ఎస్ వారి పై దాడులు చేశారు. వారు కట్టెలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో చుట్టు పక్కల వారు భయపడ్డారు. వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ కార్యకర్తలు గళ్లాలు పట్టుకొని కొట్టుకున్నారు.
విషయాన్ని గ్రామంలో ఉన్న పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కొంత మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మంది కార్యకర్తలు పారిపోయారు. దాడుల్లో నలుగురు కార్యకర్తలకు తలలు పగిలాయి. మరి కొంత మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వెంటనే అదనపు బలగాలతో పోలీసులు మోహరించి గ్రామాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
నాగులపల్లి గ్రామంలో దాడుల విషయం తెలుసుకొని ఎన్నికల అధికారులు అలర్ట్ అయ్యారు. మిగతా వారికి పోలింగ్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్టు చేశారు. కాంగ్రెస్ , టిఆర్ఎస్ నేతలతో పోలీసులు మాట్లాడారు. పోలింగ్ కు సహకరించాలని దాడులకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కార్యకర్తలను అదుపులో పెట్టాలని నేతలను అధికారులు ఆదేశించారు.