శనివారం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతుండగా మూడు మీడియా సంస్థలపై లీగల్ నోటిసులు ఇస్తానని వ్యాఖ్యానించారు. ఐటి దాడుల సమయంలో టివి9, టి న్యూస్, నమస్తే తెలంగాణ మీడియా సంస్థలు అడ్డగోలుగా ప్రసారాలు చేసి తన ఇమేజ్ ను , కాంగ్రెస్ ప్రతిష్టను తీశాయన్నారు. వాటి యాజమాన్యాలు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే నోటిసులు పంపిస్తానన్నారు.
దీంతో అప్పటి వరకు రేవంత్ ప్రసారాన్ని ప్రసారాలు చేసిన తెలుగు మీడియా ఛానెళ్లన్ని లైవ్ టెలికాస్ట్ ను ఆపేసి యూ ట్యూబ్ లైవ్ ఇచ్చారు. గతంలో కూడా రేవంత్ రిపోర్టర్లను ఉద్దేశించి డిఎన్ ఏ టెస్టులకు సిద్దమా అని ప్రశ్నించారు. రేవంత్ ప్రెస్ మీట్ పెడితే అయిపోయే వరకు ప్రసారం చేసే ఛానళ్లు కూడా రేవంత్ లైవ్ ను టెలికాస్ట్ చేయలేదు.
అక్టోబర్ 3 న ఐటి అధికారులు తనను విచారించినప్పుడు ఆ మూడు ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తల ఆధారంగా తనను వేధించారన్నారు. అప్పుడు తాను అధికారులను ఒక్కటే అడిగానని మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించి అడగండి కానీ ఇలా ఎవరో రాసిన వార్తల గురించి నన్ను అడగటమేంటని ప్రశ్నించానని తెలిపారు.
మీడియా సోదరులు కూడా అన్ని వివరాలు తెలుసుకొని, ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోని ప్రసారం చేయాలన్నారు. రేవంత్ వ్యాఖ్యలతో తెలుగు మీడియా ఛానలన్నీ రేవంత్ కు షాక్ నిస్తూ కేవలం 5 నిమిషాలు మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేశాయి. తమ యూ ట్యూబ్ ఛానల్ లో మాత్రం లైవ్ ను ప్రసారం చేశాయి. రేవంత్ దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడితే అన్ని ఛానల్స్ కూడా 5 నిమిషాలకంటే ఎక్కు వ ప్రసారం చేయలేదు.
రేవంత్ రెడ్డి మాట్లాడితే అయిపోయే వరకు కూడా నాన్ స్టాప్ గా ప్రసారం చేసే టివి ఛానళ్లు కేవలం 5 నిమిషాలు మాత్రమే రేవంత్ ప్రసంగం ప్రసారం చేయడంతో అంతా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి రేవంత్ కి ఇంత ఇమేజ్ తీసుకొచ్చింది మీడియానేనని అటువంటి మీడియా పై గత కొంతకాలం నుంచి రేవంత్ విరుచుకుపడుతుండటంతో మీడియా సంస్థలు కూడా తమ స్ట్రాటజీని మార్చుకున్నాయోమోనని పలువురు చర్చించుకుంటున్నారు.
రేవంత్ ప్రసంగం ఒక్కసారిగా అన్ని ఛానల్స్ లలో నిలిచి పోవడంతో టివి రిమోటులతో ఛానళ్లు మార్చినా ఎందులో అవుపడక ఇక చేసేది లేక చాలా మంది సెల్ ఫోన్ లలోని యూట్యూబ్ లో విన్నారు. రేవంత్ ప్రసారాల నిలిపివేత పై మీడియాతో పాటు తెలంగాణ ప్రజలలో చర్చ జరుగుతోంది.