కాంగ్రెస్ ను.. కోదండరాం ను కడిగి పారేసిన హరీష్ రావు

తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం జరిగిన ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీని చెడామడా వాయించేశారు. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాల నుంచి మొదలుకొని నేటి వరకు కడిగేశారు. హరీష్ రావు ఏం మాట్లాడారో కింద చదవండి.

కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై కుట్రలు ప్రదర్శిస్తోంది. అధికారం లో లేక పోవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోంది. తెలంగాణ ఏర్పాటు పట్ల కాంగ్రెస్ ప్రదర్శించిన అలసత్వ వైఖరినే కాళేశ్వరం పట్ల చూపుతోంది. తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ అక్కసు పెంచుకుంది. కాళేశ్వరం నీళ్లు తెలంగాణ పంట పొలాలకు మళ్లడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. కేసులతో కాళేశ్వరం ను నీరు గార్చేందుకు కాంగ్రెస్ విఫల యత్నం చేసింది. అన్ని ప్రయత్నాలు విఫలం కావడం తో ఎన్నికలకు ముందు రౌండ్ టేబుల్ మీటింగ్ లతో హడావుడి చేస్తోంది. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం అయితే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే కాంగ్రెస్ కుట్రలకు తెరదీస్తొంది. పాము తన పిల్లలను తానే తిన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ సొంత ప్రజలకే ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబు కాళేశ్వరం ను అడ్డుకుంటున్నట్టే కాంగ్రెస్ నేతలు తెలంగాణ కు ద్రోహం చేస్తున్నారు. బక్కచిక్కిన తెలంగాణ రైతు పైనా కాంగ్రెస్ నేతల ప్రతాపమా ?

గోదావరి ,కృష్ణా జలాల్లో తెలంగాణ కు ఉన్న వాటా ను వినియోగించుకోవాలన్నదే మా ప్రభుత్వ అభిమతం. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 954 టీఎంసీ లయితే ఎప్పుడయినా కాంగ్రెస్ వాటిని వినియోగించుకోవాలని ప్రయత్నించిందా ? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ను 37 యేళ్ళ తర్వాత పూర్తయ్యింది అని ప్రకటించి కాంగ్రెస్ ఆరులక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టును 9 లక్షల 25 వేల ఎకరాలకు చేర్చడమే trs ప్రభుత్వ లక్ష్యం. గోదావరి పై ఒక్క మధ్యతరహా ప్రాజెక్టును పూర్తి చెయని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. మిడ్ మానేరు ను పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది. రాళ్ళ వాగు ,మత్తడి ప్రాజెక్టుల ను పూర్తి చేసి నీళ్లందించాం. ప్రాజెక్టులను అడ్డుకోవడం లో కాంగ్రెస్ ,జేఏసీ లు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ కారు లో కోదండరాం, మరికొంత మంది న్యాయవాదులు ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొట్టడానికి వెళ్లడం కుమ్మక్కుకు నిదర్శనం కాదా ? చనిపోయిన వారి పేర్ల మీద కాంగ్రెస్ నేతలు కేసులు వేసి శవరాజకీయాలు చేశారు. కేసులు వేసిన వారికి కాంగ్రెస్సే ఆర్ధిక సాయం చేసింది. మాజీ మంత్రి ముత్యం రెడ్డి కొడుకు పీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ నుంచి పిటిషనర్ల కు ఢిల్లీ ఫ్లైట్ టికెట్ లకు ఎన్నో సార్లు డబ్బులు వెళ్లాయి. ఇపుడు కొన్ని ఆధారాలే బయట పెడుతున్న ..మిగతా ఆధారాలు అసెంబ్లీ లో బయట పెడతా.

కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాళేశ్వరానికి అన్ని అనుమతులు సాధించాం. కోర్టుల్లో పోరాడి ఓడిన కాంగ్రెస్ నేతలు ఇపుడు రౌండ్ టేబుల్ రాజకీయం చేస్తున్నారు. తమ్మిడి హట్టి పై కాంగ్రెస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారు. మే లో తమ్మిడి హట్టి దగ్గర 20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని షబ్బీర్ అలీ అబద్దం ఆడారు. కేంద్ర జలసంఘం వివరాల ప్రకారం మే లో అక్కడ ప్రవహించింది 12 వందల క్యూసెక్కులే. కెసిఆర్ రైతాంగ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే వారు కాబట్టి అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రాణహిత చేవెళ్ల కు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోడీ కి లేఖ రాశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం చర్చలకు మహారాష్ట్ర వెళితే అక్కడి మంత్రి అనుమతులు లేని ప్రాజెక్టును అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. రకరకాల ప్రయత్నాల తర్వాత సీఎం కెసిఆర్ మహారాష్ట్ర తో గోదావరి జలాలపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ హాయం లో ఏడేండ్లలో చేయని పనిని సీఎం కెసిఆర్ ఏడు నెలల్లో చేసి చూపించారు. ప్రాణహిత చేవెళ్ల పై ఇపుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు అపుడు మహారాష్ట్ర తో ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేక పోయారు ? తమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం మార్చి 2015 లో కీలక ప్రకటన చేసిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల పై ముందుకు సాగలేకపోయాం. తమ్మిడి హట్టి ఎండమావి అయితే మేడి గడ్డ ఒయాసిస్. ఏ ప్రభుత్వమైనా ఒయాసిస్ కు మొగ్గు చూపుతుందా ?ఎండమావి వైపు మొగ్గుతుందా ?

నాగార్జున సాగర్ పైన ఆలమట్టి ,శ్రీరామ్ సాగర్ పైన బాబ్లీ కట్టడం తో ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏమయింది ? అలాంటి పొరపాట్లు జరగవద్దని ముందు చూపుతో కాళేశ్వరాన్ని మేడి గడ్డ దగ్గర ప్రతిపాదించాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కు పది హేడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ మొదటి జీవో కాంగ్రెస్ హాయం లో ఇచ్చారు. పంచరంగుల డ్రామాను తెలంగాణ కు చూపారు. ఎన్నో చోట్ల ఎన్నికల కోసం కొబ్బరికాయలు కొట్టారు. కేవలం పందొమ్మిది నెలల్లోనే ప్రాణహిత ప్రాజెక్టు వ్యయాన్ని రెండున్నర రెట్లు పెంచుతూ రెండో జీవో ఇచ్చారు. అప్పుడెందుకు అంచనా వ్యయం పెంచారు ? కాళేశ్వరం అంచనా వ్యయాన్ని పెంచడానికి భూ పరిహారం ఆరింతలు పెరగడం ,రిజార్వాయర్లు ,లిఫ్టులు పెరగడం ,ఆయకట్టు పెరగడం ప్రధాన కారణం. మే 2012 నాటికి ప్రాణహిత చేవెళ్లకు 3234 కోట్లు ఖర్చు చేశామని చూపారు. ఇందులో 2 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులకు చెల్లించారు. ఎనిమిది సంవత్సరాల్లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ హాయంలో పెట్టిన ఖర్చు ఆరు శాతమే. కాంగ్రెస్ హాయం లో నిధుల విడుదల తీరు చూస్తే వందేళ్లయినా ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి కాక పోయేది. ప్రాణహిత ప్రాజెక్టు పై వాస్తవాలు ఇలా ఉంటే ఉత్తమ్ ,జానా లు అబద్దాలు మాట్లాడుతున్నారు. పోతిరెడ్డి పాడు ,పులిచింతల అక్రమంగా కడుతుంటే నోరు మెదపని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్ని అనుమతులున్న కాళేశ్వరం కు అడ్డుపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్రమంగా లేకుంటే కేంద్ర జలసంఘం అన్ని అనుమతులు ఎలా ఇస్తుంది ? నీళ్లు లేనిచోట మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎందుకు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

నీళ్లు లేని చోట ఏపీ లో కండలేరు ,ఓర్వకల్లు రిజార్వాయర్లు కట్టలేదా ? తక్కువ ముంపుతో 50 టీఎంసి ల సామర్ధ్యం తో మల్లన్న సాగర్ హైదరాబాద్ భవిషత్ అవసరాలు తీరుస్తుంది. టిఆర్ఎస్ ఎడ్డము అంటే కాంగ్రెస్ తెడ్డం అంటోంది. ప్రతి దానికి వ్యతిరేకత ప్రదర్శించడం కాంగ్రెస్ కు అలవాటయ్యింది. తోట పల్లి దగ్గర ముంపు గ్రామాలు తగ్గిస్తే వాటిని ముంచాలని ఉత్తమ్ ధర్నా చేస్తారు. ఇది కాంగ్రెస్ తీరు. ఖర్చు తగ్గించేందుకే తమ్మిడి హట్టి ప్రాజెక్టును వార్ధా దగ్గర కు మార్చాం. బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు కొనసాగుతోంది. దీని పై కాంగ్రెస్ నేతలు దుష్ప్రాచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఎంతగా అడ్డుపడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు తో గోదావరి జలాలను రైతుల పొలాలు తడుపుతాం. కాళేశ్వరాన్ని అందరూ మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ నేతలు నొచ్చుకుంటున్నారు. మాహై కమాండ్ ప్రజలే. వారే అన్నింటిని నిర్ణయిస్తారు. మేము ప్రజలకు మంచి చేస్తున్నాం. కాబట్టే అన్ని సర్వేల్లో trs కు వంద సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ హాయం లో కొన్ని ప్రాజెక్టుల వ్యయం వంద రెట్లు పెరిగింది. బ్యాంకుల నుంచి రుణం తెస్తున్నాం ..నిర్ణీత వ్యవధి లో వాటి పూర్తి కి ప్రయత్నిస్తున్నాం.