బాబు విషయంలో “షా”కిచ్చిన టి.బీజేపీ నేతలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ నేతలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చెస్తున్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలపై పోరాడుతూ ప్రజామద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతోపాటు దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన ఉత్సాహంలో క్షేత్రస్థాయిలో రకరకాల కార్యక్రమాలతో హడావిడి చేస్తోన్నారు. అయితే ఈ సమయంలో వారికి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది!

హస్తిన పర్యటనలో ఉన్న చంద్రబాబు… అమిత్ షా తో భేటీ అయ్యారు. దీంతో… రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో “బీజేపీ – టీడీపీ” కలిసి పోటీ చేయబోతున్నాయంటూ కథనాలు ప్రసారం చేసింది టీడీపీ అనుకూల మీడియా. అసలు, “అమిత్ షా.. చంద్రబాబుని బ్రతిమాలేస్తున్నారు. ఏపీలో మద్దతు ఇస్తాం.. ఫలితంగా తెలంగాణలో తమకు మద్దతు ఇవ్వండని రిక్వస్టులు చేసేశారని” స్టోరీ బోర్డులు వేసేశారు!

అయితే ఈ విషయంపై షాక్ తిన్న తెలంగాణ బీజేపీ నేతలు… అమిత్ షా కు షాకిచ్చే రీతిలో స్పందించారు. తెలంగాణ బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడుతుంది.. బీఆరెస్స్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతుంది.. ఈ సమయంలో చంద్రబాబుని తీసుకొచ్చి తమపై రుద్దొద్దు, ఫలితంగా పార్టీని ఏపీలో ఉన్న పరిస్థితికి తీసుకురావొద్దు అని సూటిగా సూచించారట. ఈ పొత్తుకు ఏమాత్రం ఒప్పుకోమని సుత్తిలేకుండా గట్టిగా చెబుతున్నారట! దీంతో షాక్ తిన్న షా… పొత్తు పంచాయతీని పక్కనపెట్టారని సమాచారం!

కాగా… 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు.. 2018 ఎన్నికల సమయానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇలాంటి అనైతిక పొత్తులు పెట్టుకోవడానికి సైతం వెనకా ముందూ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే చంద్రబాబుతో కలిసి ప్రయాణం అంటే… అంతకు మించిన ఆత్మహత్యా సదృశ్యం లేదని తెలంగాణ బీజేపీ నేతలు బలంగా ఫిక్సయారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని అధిష్టాణం ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని సమాచారం!