రేవంత్ అనుచరులపై ఐటి దాడుల్లో షాకింగ్ ట్విస్ట్

కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో రెండు రోజులపాటు అలుపెరగని రీతిలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. వారు పలు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు తీసుకుని వెళ్లిపోయారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి చుట్టాలు, కుటుంబసభ్యుల ఇండ్లతోపాటు రేవంత్ అనుచరుల ఇండ్ల మీద కూడా ఐటి రైడ్స్ జరిగాయి. అయితే ఈ ఐటి రైడ్స్ లో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నది. ఆ వివరాలేంటో కింద చదవండి.

సోమవారం ఐటి అధికారుల ముందు రేవంత్ కీలక అనుచరుడు ఉదయ్ సింహా హాజరయ్యారు. గతంలో టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలు ఇచ్చిన సమయంలో రేవంత్ తో పాటు ఉన్న వ్యక్తి ఉదయ్ సింహ. అయితే రేవంత్ ఇంట్లో ఐటి సోదాలు జరిగిన సమయంలోనే ఉదయ్ సింహా ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. కాకపోతే రెండురోజులపాటు జరగలేదు. కొద్దిగా తక్కువసేపు జరిగాయి. అక్కడ కూడా పలు ఆధారాలను ఐటి అధికారులు తీసుకుపోయారు.

ఇవాళ ఉదయం ఉదయ్ సింహా ఐటి అధికారుల మందు హాజరయ్యారు. అయితే కొందరు వ్యక్తులు తాము ఐటీ శాఖ అదికారులమంటూ చైతన్యపురి లిమిట్స్ లోని జైపురి కాలనీలో ఉదయసింహ బందువు రణధీర్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిపారని ఉదయ్ ఐటి శాఖ అధికారులకు తెలిపారు. నిన్న ఆదివారం ఈ సోదాలు జరిపినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సమయంలోనే సదరు వ్యక్తులు సెల్ ఫోన్ లు, నగదు, బంగారం తమ బంధువైన రణధీర్ రెడ్డి ఇంట్లోంచి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ సోదాల విషయాన్ని ఐటీ అదికారుల దృష్టికి ఉదయ్ సింహా తీసుకు రావడంతో ఐటి అధికారులు షాక్ కు గురయ్యారు. కొంతసేపటి తర్వాత తేరుకున్న ఐటి అధికారులు తాము ఆ సోదాలు చేయలేదని ఉదయసింహ తో చెప్పారు.

అయితే ఉదయ్ సింహా లేవనెత్తిన ఈ అంశం తెలంగాణలో దుమారం రేపుతున్నది. ఐటి అధికారుల పేరుతో సోదాలు చేసిన నకిలీ అధికారులెవరు అన్నది తేలాల్సి ఉంది. ఐటి దాడుల పేరుతో నకిలీలు వచ్చి సొమ్ములు కొట్టేయడం కలకలం రేపుతున్నది. ఈ విషయమై ఆలస్యంగా తేరుకున్న ఉదయ్ సింహా బంధువులైన రణధీర్ రెడ్డి కుటుంబసభ్యులు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందదుకు  సిద్ధమయ్యారు.

ఈ విషయంలో నిజా నిజాలు తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డి మీదనే రాజకీయ కుట్రతో ఐటి దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే రేవంత్ ఇంటి మీద దాడులు జరిపినట్లు ఆరోపిస్తున్నది. ఈ దశలో నకిలీలు ఎంటరై కొత్త రకం దోపిడీకి పాల్పడడం సంచలనం రేకెత్తిస్తున్నది.

ఈ నకిలీ ఐటి అధికారుల దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఉదయ్ సింహా బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ సర్కారు పోలీసులే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి ఏ రకమైన వివరాలు వెల్లడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.