అప్పుడే హరీష్ గుజరాత్ మహిళను తన భార్యగా అమెరికా పంపిండు

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్, ఆయన మేనల్లుడైన సీనియర్ నేత తన్నీరు హరీష్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంత్రి హరీష్ రావుపై తీవ్రమైన విమర్శలు చేశారు. తప్పుడు పాస్ పోర్ట్  కేసులో జగ్గారెడ్డికి సంబంధమే లేదన్నారు. అసలు పాస్ పోర్ట్ క్రిమినల్స్ కేసిఆర్, హరీష్ రావులే అని ధ్వజమెత్తారు. ఇంకా రేవంత్ ఏం మాట్లాడారో కింద చదవండి.

నాపై రాజకీయ కక్ష తోనే జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే అల్లుడు హరీష్ రావు గుజరాత్ మహిళను తన భార్యగా చెప్పి అమెరికాకు పంపించాడు. ఈ కేసులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా పాత్రదారుడుగా ఉన్నారు. 

కేసీఆర్, హరీష్ లే ఈ కేసులో ఉన్నారు. మానవ అక్రమ రవాణా కేసులో అసలు జగ్గారెడ్డి కి సంబంధమే లేదు. కేసీఆర్ సీఎం అయ్యాక దొంగ పాస్ పోర్ట్ కేసులోని ఛార్జ్ షీట్లో కేసీఆర్, హరీష్ పేర్లను తప్పించారు. కేసీఆర్ కు లొంగనందుకే జగ్గారెడ్డి పై కేసులు బనాయించారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పోలీసులతో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయిస్తున్నారు. 

శాంతి భద్రతలు గవర్నర్ పరిధిలో ఉన్నా ..? గవర్నర్ ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కేసీఆర్ ,హరీష్ రావుల పై విచారణ జరగాలి. పోలీసు బాస్ మహేందర్ రెడ్డి కి డిజిపి పోస్ట్ ఇచ్చినందుకు .. ఈకేసులో నుండి కేసీఆర్, హరీష్ ల పేర్లను తప్పించారు.  కాంగ్రెస్ నేతలను భయపెట్టి కేసీఆర్ గెలవాలని చూస్తున్నారు. 

తుపాకీనే లేని గండ్ర వెంకటరమనేరెడ్డి పై తుపాకీతో బెదిరించారని కేసు పెట్టారు. అధికారంలోకి రావడానికి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను చంపేయడానికి కూడా వెనకాడరు. మమ్మల్ని కేసులతో వేధించేందుకు కేసీఆర్ తన సామాజిక వర్గానికి చెందిన పొలిసు అధికారులను నియమించారు. మమ్మల్ని వేధిస్తున్న అధికారుల పేర్లను కాంగ్రెస్ డైరీలో రాసుకుంటున్నాం. మేము అధికారంలోకి వచ్చాక ఆ అధికారుల కు వడ్డీతో సహా చెల్లిస్తాం.

దెబ్బకు దెబ్బ తీస్తానం. లెక్క పెట్టి మరి కాంగ్రెస్ రివెంజ్ తీసుకుంటుంది. పోలీసులారా .. కేసీఆర్ ప్రయివేట్ సైన్యం గా మారకండి. దొంగ పాస్ పోర్ట్ ల కేసుపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణకు గవర్నర్ ఆదేశించాలి. గవర్నర్ స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం ..లేకపోతే కోర్ట్ కు వెళతాం. కేసీఆర్  మమ్మల్ని కేసులకు, జైళ్లకు పంపినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు. 

మేమే అధికారంలోకి వస్తాం ..కేసీఆర్ కు మిత్తితో చెల్లిస్తాం. కేసీఆర్ రాజకీయ వేట నాతోనే మొదలు పెట్టారు. నన్ను అరెస్ట్ చేయమనుండి .. కేసులు పెట్టుకోమనండి ..నేనూ చూస్తా. అప్పుడు ఏం జరుగుతుందో కేసీఆర్ కు తెలుస్తుంది. జగ్గారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామికం. కేసిఆర్ కు రోజులు దగ్గరపడ్డాయని, అందుకే ముందస్తుకు పోయిండని జనాలంతా అనుకుంటున్నారు. రేపు ఎన్నికల తర్వాత అదే నిజమైతది.