విజయశాంతి రాములమ్మ ప్రచారం మొదలు కాబోతుంది . ఒకవైపు చంద్ర శేఖర్ రావు ప్రతిపక్షాన్ని ఊపిరి తిప్పుకోనివ్వకుండా ప్రచారం సాగిస్తున్నాడు . ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ కేంపెయినర్ గా విజయ శాంతి వచ్చేస్తుంది . ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే …. అన్నట్టుగా విజయ శాంతి ఈ అవకాశం కోసమే చూస్తుంది . తన కూతురు కవిత కోసం చంద్ర శేఖర్ రావు పార్టీ నుంచి పంపించడానికి పొగపెట్టాడని విజయ శాంతి తన సన్నిహితుల దగ్గర వాపోయింది . ఇప్పుడు చంద్ర శేఖర్ రావును ఓడించడానికి తన శక్తి యుక్తులన్నీ ఉపయోగించబోతుంది .
విజయశాంతి తెలుగు ,తమిళ, కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది . 1992లో మొండిమొగుడు పెంకి పెళ్ళాం సినిమాతో విజయశాంతి తెలంగాణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . ఈ చిత్రం లోని తెలంగాణ యువతిగా నటించింది . 1996లో దాసరి నారాయణ రావు రూపొందించిన ఒసే రామ్ములమ్మతో విజయ శాంతి తెలంగాణ సమాజానికి బాగా దగ్గరైంది . పైగా ఆమె పూర్వులది తెలంగాణ కావడం తనకెంతో సంతోషమని అప్పట్లో చెప్పింది .
విజయశాంతి ఓ విలక్షణమైన నటి, ప్రతిఘటన, వందేమాతరం, రేపటి పౌరులు , కర్తవ్యం, అరుణ కిరణం, లేడీ బాస్, రౌడీ దర్బార్, భారత రత్న చిత్రాలతో తనదైన ముద్ర వేసింది . 1990లో కర్తవ్యం సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది . అదేసమయంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కిషన్ అద్వానీ తో పరిచయం అయ్యింది . విజయ శాంతి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అద్వానీ ఇంటికి వెళ్లకుండా వచ్చేదికాదు . అద్వానీ ప్రోత్సహం తోనే 1998లో బీజేపీలో చేరింది . మహిళా మోర్ఛాకు కార్యదర్శి గా ఎంపికయ్యింది . తరువాత తమిళనాడులో జయలలిత స్పూర్తితో 2009లో తల్లి తెలంగా అనే పార్టీ ప్రారంభించి దానిని పక్కన పెట్టి టీఆరెస్ పార్టీలో చేరింది . మెదక్ నుంచి లోక సభకు పోటీ చేసి విజయం సాధించింది . తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించింది . అయితే చంద్ర శేఖర్ రావుతో విభేదాలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది .
దాదాపు నాలుగేళ్లు మౌనంగా ఉంది . ఆమధ్య ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసింది . బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా వెళ్లి బోనం ఎత్తుకుంది . ఇప్పుడు తెలంగాణాలో ముందస్తు రావడంతో విజయ శాంతి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తుందా ? మౌనంగా ఉండి పోతుందా ? అనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమవుతుంది .
టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు చంద్ర శేఖర్ రావు తో మనస్పర్థలు వచ్చిన తరువాత విజయ శాంతి ఆ పార్టీ వీడారు . అవకాశం వస్తే చంద్ర శేఖర్ రావు ను ఓడించాలని చాలా కాలం నుంచి ఎదురు చూస్తుంది . ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం , సీపీఐ , కోదండరాం పార్టీ అన్నీ కలసి కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించబోతున్నాయి . ఈ అవకాశాన్ని విజయ శాంతి ఉపయోగించు కోవాలనుకుంటుంది. ఈనెల 15వ తారీకు తరువాత ఒక శుభ ముహూర్తంలో విజయ శాంతి సమర శంఖారావం పూరించ బోతుంది . ఎలాగైనా టీఆరెస్ పార్టీని ఓడించాలనే లక్ష్యంతో విజయశాంతి భారీ వ్యూహంతో ఉందని తెలిసింది . ఏ మేరకు “విజయ”మ్ సాధిస్తుందో చూడాలి !