బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి అధిష్టానం తీపి కబురు అందించనుందా? రేపో మాపో రేవంత్ రెడ్డి కోరిన పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం రెడీ అయిందా? కీలక పదవి కోసం ఇంతకాలం ఎదురుచూసిన రేవంత్ రెడ్డి ఇకపై మరింత జోష్ పెంచనున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది. చదవండి స్టోరీ.

రేవంత్ రెడ్డి టిడిపిలో అగ్ర స్థానంలో ఉన్నప్పటికీ ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన సమయంలోనే తనకు ఏ పదవి ఇస్తారన్నదానిపై చర్చ జరిగింది. తనకు ప్రచార కార్యదర్శి పదవి ఇవ్వాలని రేవంత్ ప్రతిపాదించారు. అయితే మధ్యలో రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రసిడెంట్ పదవి ఇస్తామని అధిష్టానం నుంచి కబురు అందినట్లు చెబుతున్నారు. అయితే ఆ పదవిని రేవంత్ రిఫ్యూజ్ చేశారు. తనకు వర్కింగ్ ప్రసిడెంట్ కాదు పిసిసి ప్రసిడెంట్ పదవి కూడా వద్దని నర్మగర్భంగా చెప్పారు.

దీంతో రేవంత్ కు ప్రచార కార్యదర్శి పదవిని కట్టబెట్టేందుకు అధిష్టానం అంగీకారానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి. రేపు మాపు, ఇదిగో అదిగో అంటూ రేవంత్ రెడ్డిని పదవి ఊరిస్తూ వచ్చింది. అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు రేవంత్ కు పదవి రాకుండా అడ్డుపుల్లలు వేశారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. ముఖ్యమైన నాయకులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని రేవంత్ స్వయంగా మీడియా ముందు వెల్లడించారు కూడా.

ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికల పేరుతో అన్ని రాజకీయ పార్టీల్లో చలనం తీసుకొచ్చారు సిఎం కేసిఆర్. ఇప్పటికే ఆయన టిఆర్ఎస్ లో ముందస్తు కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కేసిఆర్ ఎత్తులను పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. ముందస్తుకు మేం రెడీ అని అధికార పార్టీ సవాల్ కు జవాబు చెప్పింది. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. గురువారం సాయంత్రం రాహుల్ తో ఉత్తమ్, కుంతియాతోపాటు ఏఐసిసి కార్యదర్శులు భేటీ కానున్నారు. ఇప్పటికే అశోక్ గెహ్లట్ ను ఉత్తమ్ కలిసి చర్చించారు. 

ముందస్తు పై టీపీసీసీ కి రాహుల్ గాంధీ యాక్షన్ ప్లాన్ ఇవ్వనునున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు పీసీసీ మ్యానిఫెస్టో ,ప్రచార కమిటీలను ఎఐసిసి ప్రకటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రచార కమిటీ చైర్మన్ గా రేవంత్ ..మ్యానిఫెస్తో కమిటీ చైర్మన్ గా దామోదర  రాజనర్సింహ్మను ఎంపిక చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. టిఆర్ఎస్ పార్టీ సెప్టెంబరు 2న జరపతలపెట్టిన ప్రగతి నివేదన సభకు ముందే పోస్టులను డిక్లేర్ చేస్తారా? లేదంటే ప్రగతి నివేదన సభ తర్వాత డిక్లేర్ చేస్తారా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. దీనిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ వచ్చే చాన్స్ ఉందంటున్నారు.

అలాగే ప్రచార కమిటీకి, మ్యానిఫెస్టో కమిటీకి కో కన్వీనర్లుగా ,డీకే అరుణ ,కోమటిరెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉమ్మడిరాష్ట్రంలోనే మంత్రులుగా పనిచేసి సీనియర్ నేతలుగా ఉన్న వీరు కో కన్వీనర్ పదవులను అంగీకరిస్తారా అన్న చర్చ ఉంది. భట్టి విక్రమార్క తో పాటుగా మరో నాయకుడైన పొన్నం ప్రభాకర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించవచ్చని అంటున్నారు. అలాగే మూడో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.