TG: సోమవారం తెలంగాణలో జరిగిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. ఈ ప్రశ్న పత్రాలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఏకంగా రెండు ప్రశ్నలు రావడంతో గ్రూప్ 2 అభ్యర్థులు మాత్రమే కాకుండా బిఆర్ఎస్ నేతలు సైతం ఈ విషయంలో రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ సంపాదించుకోవడం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు ఎంతోమంది ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.
ఇలాంటి తెలంగాణలో నిర్వహించే పరీక్ష పత్రాలలో చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటూ బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయంపై హరీష్ రావు కూడా స్పందిస్తూ రేవంత్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ చరిత్ర, పోరాటం చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అది పేపర్ మీద చేసిన సంతకం కాదు.. కాలం మీద చేసిన సంతకం.. ఉద్యమ చరిత్రను చెరిపేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల యత్నాలను తెలంగాణ సమాజం గుర్తించింది, మీకు ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హరీష్ రావు మండిపడ్డారు.
గ్రూప్ 2 నాలుగు పేపర్లలో చివరిదైన తెలంగాణ ఉద్యమం పేపర్ ఈ పేపర్లో తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాల నుంచి పలు ప్రశ్నలు ఆడగాల్సింది పోయి, ఉమ్మడి ఏపీలోని చంద్రబాబు నాయుడు పాలన గురించి ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్న పత్రం చూస్తుంటే ఈ పరీక్ష టీజీపీఎస్సీనా టీడీపీ(TDP) ఎస్సీనా? ఇది తెలంగాణ ప్రభుత్వమా ? తెలుగుదేశం ప్రభుత్వమా?’ అని మండిపడుతున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పారు.
తెలంగాణలో కెసిఆర్ ఆనవాళ్లు కాదు కదా తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని ఈ సందర్భంగా టిఆర్ఎస్ నేతలు హరీష్ రావు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 2 అభ్యర్థుల సైతం ఈ ప్రశ్నల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.