ఢిల్లీ బాట పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.! కారణమేంటబ్బా.?

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి వెళ్ళారు. తన వెంట సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డిని కూడా తీసుకుని ఢిల్లీకి వెళ్ళారట కవిత. ఇంతకీ, కవిత ఎందుకు ఢిల్లీకి వెళ్ళినట్లు.? తెలుగు రాజకీయాల్లో కవిత ఢిల్లీ పర్యటనపై బోల్డన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌కి సంబంధించి కవిత మీద రాజకీయ ఆరోపణలు షురూ అయిన సంగతి తెలిసిందే. ‘లిక్కర్ క్వీన్’ అనే పేరు కూడా పెట్టేశారు కవితకి రాజకీయ ప్రత్యర్థులు.

కవితకు ఈడీ నుంచి నోటీసులు రాబోతున్నాయనీ, అరెస్టు కూడా తప్పకపోవచ్చునంటూ బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రకు సంబంధించినంతవరకు ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. అంటే, ఈడీ కావొచ్చు.. సీబీఐ కావొచ్చు.. ఎక్కడా కవిత పేరు వెల్లడించలేదు. అయితే, కవిత ఎందుకు ఢిల్లీకి వెళ్ళినట్లు.? ఈడీ నుంచి నోటీసులు రాబోతున్నాయ్.. అని నిన్ననే ప్రచారం జరగ్గా, ఈ రోజు ఆమె ఢిల్లీకి పయనమవడం.. అది కూడా లాయర్‌ని వెంటేసుకుని వెళ్ళడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

నేషనల్ మీడియాతో కవిత ఇంటరాక్ట్ కాబోతున్నారట కూడా. అంటే, లిక్కర్ స్కామ్ విషయమై కవిత ఏమైనా స్పందిస్తారా.? లేదంటే, భారత్ రాష్ట్ర సమితి విషయమై కవిత ఏమైనా ప్రత్యేక బాధ్యతలు తీసుకున్నారా.? అందుకే ఆమె ఢిల్లీకి వెళ్ళారా.? అన్నది తేలాల్సి వుంది.