పొన్నంను గెలిపించటం జనాల బాధ్యతట…విచిత్ర వాదన

కాంగ్రెస్ అభ్యర్ధిగా మహాకూటమి తరపున పోటీ చేస్తున్న మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు. అదేమిటంటే, కరీంనగర్ అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న తనను గెలిపించాల్సిన బాధ్యత జనాలకే ఉందట. పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్ధుల్లో పొన్నం ప్రభాకరే మేలైన అభ్యర్ధి అని ప్రజలు అనుకుంటున్నారట. పొన్నంను  శాసనసభకు గెలిపిస్తేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలందరూ అనుకుంటున్నారట. కాబట్టి సమస్యల పరిష్కారం అవ్వాలంటే తనకే ఓటు వేయాలని కూడా జనాలందరూ డిసైడ్ అయ్యారట.  కాబట్టే తన గెలుపుపై తనకు ఎటువంటి అనుమానం లేదని పొన్నం చాలా గడుసుగా చెబుతున్నారు.

 

కరీంనగర్ లో పొన్నంను గెలిపించుకోవాల్సిన బాధ్యత జనాలది ఎలా అవుతుందో పొన్నమే కాస్త వివరిస్తే బాగుంటుంది. కరీంనగర్ లో పోటీ చేయమని జనాలేమన్నా పొన్నంను వేడుకున్నారా ? పొన్నం గనుక అసెంబ్లీకి పోటీ చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని ఎవరైనా చెప్పారా ? అసలు పొన్నం వల్ల కరీంనగర్ జిల్లాకు గానీ నియోజకవర్గానికి కానీ జరిగిన మేలేమిటి ? రెండుసార్లు ఎంపిగా గెలిచారు కదా ? జిల్లాకు గానీ లేకపోతే పార్లమెంటు నియోజకవర్గానికి గానీ ఏమన్నా ఉపయోగపడ్డారా ? ఈ ప్రశ్నలకు ముందు పొన్నం సమాధానం చెప్పి తర్వాత అసెంబ్లీలో తనకు ఎందుకు ఓటు వేయాలో తెలుసుకోవచ్చు.

 

పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో అందరికన్నా తాను ఏ విధంగా మెరుగో చెప్పుకునే బాధ్యత పొన్నంపైనే ఉంది. పోటీ చేసే ప్రతీ అభ్యర్ధీ అందరికన్నా తానే మెరుగైన అభ్యర్ధినని చెప్పుకోవటం మామూలే. అంతమాత్రాన తనను గెలుపించుకునే బాధ్యత జనాలదే అని పొన్నం చెప్పుకోవటం విచిత్రంగా ఉంది. రాజకీయంగా తన మనుగడ కోసం పొన్నం రాజకీయాల్లో ఉన్నారే కానీ ప్రజలకు సేవ చేయటం కోసం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. సరే, ఏ పార్టీ అయినా ప్రజలకు సేవ చేయటమే తమ ధర్మమని చెప్పుకుంటుంది. ప్రతీ నాయకుడు కూడా తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటారు. అంతమాత్రానా వాళ్ళ మాటలు విని చెవుల్లో పూలు పెట్టుకునే జనాలు ఎవరూ లేరన్న విషయం పొన్నం గ్రహిస్తే బాగుంటుంది.