టిఆర్ఎస్ లో నాయినికి అవమానం, నాయిని మీద సుమోటో కేసు పెట్టాలి : రేవంత్

టిఆర్ఎస్ అంతర్గత విషయాలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సూటి విమర్శలతో విరుచుకుపడ్డారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి టిఆర్ఎస్ లో ఘోరమైన అవమానం జరుగుతుందన్నారు. ఒకవైపు నాయిని నర్సింహ్మారెడ్డి మీద రేవంత్ సానుభూతి తెలుపుతూనే మరోవైపు నాయిని పై కఠినంగా మాట్లాడారు. నాయిని నర్సింహ్మారెడ్డి వ్యాఖ్యల మీద ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఆసక్తికరమైన అంశాలను లేవనెత్తారు. రేవంత్ ఏం మాట్లాడారో కింద చదవండి.

కేసీఆర్ మంత్రివర్గ సహచరులను పట్టించుకోవడంలేదు. కార్యకర్తలను ఘోరంగా బానిసలుగా చూస్తున్నారు. ప్రగతి భవన్ అప్రకటిత కర్ఫ్యూ ప్రాంతంగా మారింది. ఏ మంత్రికీ అపాయింట్ మెంట్ దొరికే పరిస్థితే లేదు. అంతెందుకు టిఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఎంబడి ఉన్న నాయిని నర్సింహ్మారెడ్డికి అపాయింట్ మెంట్ లేదు. 

నాయిని నరసింహ్మ రెడ్డికి కేసీఆర్ నెల రోజులుగా అప్పాయింట్ మెంట్ ఇవ్వడంలేదు. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న ముమ్మాటికీ నిజం. ముషీరాబాద్ టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ నాయినిని ఇబ్బంది పెడుతున్నారు. ముషీరాబాద్ వదులుకుని ఎల్ బి నగర్ నియోజకవర్గానికి మారితే పదికోట్లు ఇస్తానని కేసిఆర్ అన్నట్లు నాయిని చెబుతున్నారు. 

టిఆర్ఎస్ లో మొదటి నుంచి కేసీఆర్ కు వెన్నంటి ఉన్న వారిలో నాయిని ఒకరు. నర్సన్నా అని పిలిచేంతే చనువు ఉంది నాయినికి. అయినా అటువంటి వ్యక్తికి కూడా నెలరోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అది అవమానం కాదా?

నేను ఎల్.బి.నగర్ లో పోటీ చేస్తే 10కోట్లు కేసీఆర్ ఇస్తానన్నారని నాయిని ప్రకటించారు. నాయిని వ్యాఖ్యల ను సుమోటోగా తీసుకోవాలి. టికెట్ ఇవ్వకపోయినా, నాయినికి కనీసం అపాయింట్ ఇవ్వడం లేదంటే టీఆర్ఎస్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నాయిని ప్రకటన ను ఈసీ సుమోటోగా తీసుకుని కేసుపెట్టాలి. ఉద్యమకారుడు, నీతి నిజాయితీ అని చెప్పుకునే కేసీఆర్ ఎన్నికల్లో నియోజకవర్గానికి 10కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. రాష్ట్రంలో ఈడీ దాడులు మోడీ, కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.