వరంగల్ లో నిరసన బతుకమ్మ.. టెన్షన్ (వీడియో)

బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడబిడ్డలకు ప్రాణం. ఈ పండుగ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ ను రాష్ట్ర పండుగగా గుర్తింపును ఇచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కూడా వెచ్చిస్తున్నది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బాధలు చెప్పుకోవడానికి కూడా తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను వేదికగా చేసుకుంటున్నారు. తమ కష్టాలను తీర్చాలంటూ పాలకులకు బతుకమ్మ ఆడి విన్నపాలు చేసుకుంటున్నారు. తాజాగా నిరసన బతుకమ్మ పండుగలు జోరుసా సాగుతున్నాయి. అలాంటిదే వరంగల్ లో ఒకటి జరిగింది.

మేప్మా ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా రిలే దీక్షలు చేస్తున్నారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారు ఆందోళనబాట పట్టారు. జిల్లాల్లో ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వరంగల్ లో శనివారం మేప్మా ఉద్యోగులు ఎంజిఎం సెంటర్ వరకు బతుకమ్మలతో ర్యాలీగా వచ్చి చౌరస్తాలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అనంతరం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారిని అక్కడినుంచి పంపేందుకు పోలీసులు రంగం ప్రవేశం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధికార ప్రతినిధి రవళి కూచన కూడా పాల్గొన్నారు.  మేప్మా ఉద్యోగుల నిరసన బతుకమ్మ వీడియో కింద ఉంది చూడండి.

[videopress GAdOQep2]