Patancheru Fire accident: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 30 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా- 10 మంది మృతి చెందారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పైరింజన్ల సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని ప్రొడక్షన్ భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. దీంతో పరిశ్రమలో కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరిశ్రమ నుంచి ఘాటైన వాసనలు రావడంతో ప్రజలను అక్కడికి రావొద్దని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్సీ పరితోష్ పరిశీలించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ దుర్ఘటనపై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని తెలిపారు పరిశ్రమల్లో ప్రభుత్వం తరుచూ సేఫ్టి తనిఖీలు చేయకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పటాన్ చెరు, పాశమైలారంలోని పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు.