కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే.. మద్యం!

పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా… ఫైరు. అంటూ “పుష్ప” సినిమాలో అల్లూ అర్జున్ ఒక డైలాగ్ చెబుతాడు. అదే డైలాగుని ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ ఎదుర్కొంటున్న కవితకు అప్లై చేస్తున్నారు. “కవిత అంటే పద్యం అనుకుంటిరా… లే… మద్యం” అంటూ పోస్టర్లు అంటించారు.

హైదరాబాద్ బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి.. పీజీ కాలేజ్ దగ్గరలోని మెట్రో పిల్లర్ల దగ్గర… మార్చి 18వ తేదీ శనివారం ఈ పోస్టర్లు కనిపించాయి. అంటే… రాత్రికి రాత్రి కొందరు వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారన్నమాట. దీంతో… అటుగా వెళుతున్న లక్షలాది మంది కంట్లో ఈ పోస్టర్లు పడ్డాయి.

ఈ పోస్టర్లలో… “కవితక్క నీకు కావాలి సారా దందాలో 33 శాతం వాటా.. దాని కోసమే ఆడుతున్నావ్, 33 శాతం మహిళా రిజర్వేషన్ ఆట..”

“కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే మద్యం”

“తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని.. ఢిల్లీలో కవితక్క చేస్తుంది దొంగ సారా దందా”

“కల్వకుంట్ల దొంగల ముఠా.. కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం కేసీఆర్”… అనే రాతలతో ఉన్నాయి!

దీంతో… విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ పోస్టర్లను తొలగించారు. అనంతరం… సీసీ కెమెరాలు పరిశీలించి.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.