KTR: తెలంగాణలో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలా అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల రాష్ట్ర ప్రజల కూడా ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ఇక ఈయన వచ్చి రావడంతోనే తెలంగాణలో ఎక్కడా కూడా కేసీఆర్ మార్క్ కనపడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం అవుతుంది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై కేటీఆర్ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా శాఖలో టీఎస్ బదులు టీజీ మార్పు అంశంపై చేసిన ఖర్చును కేటీఆర్ తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి 1000 కోట్లు కాదు కదా నువ్వు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తెలంగాణ అస్తిత్వాన్ని ఏమాత్రం మార్చలేవని తెలిపారు.
నాలుగు కోట్ల గుండెలపై కేసీఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టు రైతు భరోసా ఇచ్చింది లేదు రుణమాఫీ పూర్తిగా చేసింది లేదు ఇక పెన్షన్లను పెంచినది కూడా లేదు. 6 గ్యారంటీలకే ఇక్కడ దిక్కులేదు కానీ ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేల కోట్ల ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈయన పోస్ట్ చేశారు.
ఈ విధంగా రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ చేసిన ఈ పోస్టుపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. కోటికి..వెయ్యి కోట్లకి తేడా తెలియనంతగా ప్రజల నుంచి సొమ్ము గుంజినావా సైకో రామ్ అంటూ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల కోసం నిధులు ఏమాత్రం లేవని గత ప్రభుత్వ పూర్తిగా అప్పులు చేసిందని చెబుతూ వచ్చారు కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయటం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.