నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఆంధ్రలో ఒక్కసారిగా సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చుట్టూ తిరగడం మొదలయింది. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ లు, చాలా స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు తీసుకువచ్చాయి. ఇవి ‘చంద్రబాబు వర్సెస్ కెసిఆర్’ ఎన్నికలు చేసేందుకు తెలుగుదేశం సిద్ధమయింది. మూడో ముఖ్యమయిన పార్టీ పవన్ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. ఆయన ‘పవన్ వర్సెస్ కెసిఆర్’ అనలేదంతే. మిగతా అంతా చెప్పేశారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని నడిపించేది కెసిఆరే.
ఆ మధ్య అమెరికాలో ట్రంప్ గెలవడం పెద్దవివాదంగా మారింది. ట్రంప్ ను గెలిపించింది అమెరికా ప్రజలు కాదు, రష్యా అధ్యక్షుడు పుతిన్ అని పత్రికల్లో తెగరాసేశారు. ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఓడిపోయేందుకు సోషల్ మీడియా తో అమెరికా ఓటర్లను రష్యా అధినేత ప్రభావితం చేశారనేది వివాదం.
ప్రపంచంలో సూపర్ పవర్ అమెరికాను రష్యా ఎంత ఈజీగా శాసించిందో చూసి అంతా తెగ నవ్వుకున్నారు. దానికితోడు అమెరికా అధ్యక్షుడయ్యాక కూడా ట్రంప్ లో పుతిన్ అంటే ఒక ప్రత్యేక అభిమానం,భయమూ భక్తి కనబరుస్తు వస్తున్నారు. ఆయన పల్లెత్తు మాట అననిది పుతిన్ నే. ఇది కూడా అనుమానాలకు తొడయింది. ఈ వివాదం మీద అమెరికా ప్రభుత్వం పెద్ద దర్యాప్తు జరిపించింది. ఈ వివాదం మీద దర్యాప్తు చేసిన రాబర్ట్ మ్యూలర్ అనే పెద్ద మనిషి ట్రంపు రష్యాతో లాలూచి పడలేదని రెండు రోజుల కిందట ఇచ్చిన నివేదికలో కితాబిచ్చారు. ఒక దేశంలో కూర్చుని మరో దేశం ఎన్నికలను శాసించే రోజులొచ్చాయని ఈ వివాదం వల్ల అర్థమవుతుంది.
ఇపుడు తెలంగాణలో కూర్చుని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నారు. నిన్న చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికలు జరుగుతున్నది తనకూ ప్రతిపక్షనాయకుడు జగన్ కు మధ్యకాదు, తనకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మధ్య అని స్పష్టంగా చెబుతూ ఎన్నికల ప్రచార సరళిని కొత్త దిశలోకి మళ్లించారు. మంత్రి దేవినేని ఉమ దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లి, జగన్ కు వోటస్తే కెసిఆర్ కు వోటేసినట్లే…ట్యాంకుబండ్ పైన అన్ని తెలుగు వెలుగులను విగ్రహాలను కూల్చేసిన కేసీఆర్ మీకు మిత్రుడా?ఆంధ్ర వాళ్ళని తల్వార్ లతో నరుకుతాము అన్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కు సహకరిస్తాడా?…ఇలా సోమవారం నాడు ప్రశ్నిస్తున్నారు. ప్రచారాన్ని టిడిపి ఎలా తీసుకువెళ్తున్నదో వూహించవచ్చు.
ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వ పెద్దల ప్రస్తావన అపుడపుడూ వస్తూ ఉండింది. ఉంది. ‘ఆంధ్రలో గెలిచేది చంద్రబాబు కాదు, జగనే’నని తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెశిడెంట్ కెటియార్ చెబితే, ఎన్నికల్లో జగన్ , కెసియార్ కుమ్మక్కయ్యారని తెలుగుదేశం వాదిస్తూ వస్తూన్నది.
ఈ వివాదం కొంత నష్టం కలిగించే ప్రమాదం ఉందని వైసిపి వర్గాల్లో కలకలం కావడంతో కెసిఆర్- జగన్ ల ఆంధ్ర సమావేశం వాయిదా వేసుకున్నారు. ఇది తెలుగుదేశానికి అనుకూలించింది. తమ వాదన పని చేస్తూ ఉందని భావించిన టిడిపి ఎన్నికల ప్రచారంలోకి కెసిఆర్ ప్రస్తావన తీసుకురావడం ముమ్మరం చేసింది. ఆంధ్రలో కెసిఆర్ జోక్యం చేసుకుంటున్నారని, జగన్ గెలిస్తే ఆంధ్ర ప్రభుత్వం ఆయన కంట్రోల్ లో ఉంటుందని, ఆంధ్రలో కూడా దోచుకోవడం మొదలుపెడతారని విమర్శించడం ప్రారంభించింది. నామినేషన్ల పర్వం మొదలయ్యాక పవన్ కల్యాణ్ కూడా ఇదే పల్లవి అందుకున్నారు.
ఇపుడు చాలా స్పష్టంగా క్యాంపెయిన్ ను కెసిఆర్ చుట్టు తిప్పడం మొదలుపెట్టారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. తెలంగాణలో ‘చిన్న పార్టీ ’అయినా కెసియార్ ను ఓడించిన ఖ్యాతి తనకే దక్కాలని విపరీతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ కూడా మైక్ ఆయనకే ఇచ్చింది మౌనంగా ఉండిపోయింది. అలాంటిదశలో కెసిఆర్ తన సహజాస్త్రం ప్రయోగించి చంద్రబాబును బూచిగా చూపి కాంగ్రెస్ ను దెబ్బతీశారు.
విడిపోయాక కూడా చంద్రబాబు తెలంగాణ మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నారని కెసిఆర్ చాలా ప్రతిభావంతం చెప్పగలిగారు. భాష కెసిఆర్ గైడెడ్ మిసైల్. ప్రచారంలో భాషను బాగా ప్రయోగించిన వాళ్లు గెలుస్తుంటారు. ప్రపంచంలో ఎన్నికల ఘనవిజయాలన్ని భాషా ప్రయోగ విజయాలే.
2019 ఎన్నికలను చంద్రబాబునాయుడు ఆంధ్ర మీద కెసిఆర్ పెత్తనం అనే నినాదం వైపు తిప్పుతున్నారు. ఆంధ్రలో కెసిఆర్ పెత్తనం ఏమిటి , ఇది ఆంధ్ర ఆత్మగౌరవ వ్యవహారం అని చెబుతూ ఈ ఎన్నికలు ‘చంద్రబాబు వర్సెస్ కెసిఆర్’ అని ప్రకటించేశారు.
పోలింగ్ కు రెండు వారాల గడువుంది. ఈ రెండు వారాల్లో ‘ఆంధ్రలో కెసిఆర్ పెత్తనం’ అనేది ప్రధానాంశం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, నిన్ననే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తనకు కెసిఆర్ మద్దతునిస్తున్న విషయాన్ని రోడ్ షోలలో అంగీకరించారు. కెసియార్ మద్దతు తీసుకుంటే తప్పులేదని,కెసిఆర్ మద్దతు నిస్తున్నది తనకు కాదని, ఆంధ్ర ప్రత్యేక హోదాడిమాండ్ కు అని జగన్ వివరణ ఇచ్చారు. ఒక విధంగా ఇది మద్దతును అంగీకరించడమే.
ఆంధ్రలో కెసిఆర్ జోక్యం ఎందుకు? అనేదానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ చెబుతున్నకారణం: కెసిఆర్ , జగన్ కు ఒక ఒప్పందం జరిగిందని, ఇక కెసిఆర్ ఆంధ్ర ఆస్తుల మీద కన్నేస్తారని, ఇందులో భాగంగా మచిలీ పట్నం రేవును అదుపులోకి తీసుకుంటారని తెలుగుదేశం నేతలు ప్రచారం చేస్తున్నారు.
జగన్ కెసియార్ కు బినామీ గా ఆంధ్రలో పరిపాలిస్తారని వారు ఆరోపిస్తున్నారు.
ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఎన్నికల్లో టిడిపిని గెలిపించండని ఆయన టిడిపి నేతలు ప్రచారం మొదలుపెట్టారు. అదిచేశాం, ఇది చేశాం, ముందు ముందు ఇంకా చేస్తామనే దానికి కంటే ప్రాంతీయ భావోద్వేగాలు రెచ్చగట్టడం ప్రయోజనకరం. సులభం కూడా. అయితే, అది అంటుకునే చిదుగు అక్కడ ఉండా.
రాజకీయాల్లో ప్రాంతీయ భావోద్వేగం బాగా పనిచేస్తుందని చంద్రబాబు కు తెలుసు.గతంలో ఎన్టీరామారావు ఆంధ్రుల ఆత్మాభిమానం ప్రయోగించి విజయవంతమయ్యారు. తర్వాత కెసిఆర్ తెలంగాణ ప్రత్యేకత తీసుకువచ్చి విజయవంతమయ్యారు. చంద్రబాబుకి ఇలా ఆత్మగౌరవం ప్రస్తావన తీసుకువచ్చే అవకాశం రాలేదు. ఈ సారి దానిని ఫుల్ గా వాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ఇక పవన్ కల్యాణ్ కూడా ఇదే మార్గం ఎంచుకున్నారు. తెలంగాణ లో ఆంధ్ర వాళ్ళ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని, జగన్ కు మద్దతునీయాలని హైదరాబాద్ లో ఆస్తులన్న వారి మీద వత్తిడి తీసుకువస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఈ వాదన సాధారణ ప్రజలకు వర్తిస్తుందా? ఎవరి ఆస్తులకు హైదరాబాద్ లో భద్రత లేదు, ఎవరి ఆస్తులను పవన్ కాపాడాలనుకుంటున్నారు? ఈ ఆస్తుల వివాదంలో చిక్కుకున్న వాళ్లు ఆంధ్రుల ప్రతినిధులా? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.
ప్రాంతీయ వాదం అనేది చాలా శక్తివంతమయిన ఆయుధం.చంద్రబాబు నాయుడు ఈ వాదాన్ని ఒక ఆయుధంగా మలుచుకోగలరా? ఒక ప్రయత్నమయితే చేస్తున్నారు. కెసిఆర్ ను బూచిలాగా చూపిస్తున్నారు. కెసిఆర్ ఎన్నికల క్యాంపెయిన్ ప్రధానాంశంగా మారారు.
మొత్తానికి ఆంధ్రలో ఎవరు గెలిచినా క్రెడిట్ కెసిఆర్ కే…