Harish Rao: తెలంగాణలో నిత్యం కాంగ్రెస్ నేతలు అలాగే బిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇలా ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు అయితే తాజాగా రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రైతు బోనస్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు తెలిపారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతు బంధు కంటే బోనస్ మేలు అంటూ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పటం దారుణమని తెలిపారు.
ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించిందని తెలిపారు.అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమేనని, అదే రైతుబంధు కింద ఏడాదికి రూ. 7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.
మీరు ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన విధంగా ప్రతి రైతుకు 15000 అంటే మరింత ఎక్కువ అవుతుందని హరీష్ రావు తెలిపారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి, సగం మందికి మొండి చేయి చూపారని, ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని చివరికి సన్నాళ్లకు మాత్రమే పరిమితం చేశారు అయితే ప్రస్తుతం ఏకంగా రైతుబంధు పథకానికే పంగనామాలు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ ఈ సందర్భంగా హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.