జిహెచ్ఎంసి వర్కర్ ను పొట్టనపెట్టుకున్న పోలీసు కారు (వీడియో)

ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన డ్యూటీ పోలీసులది. తెలంగాణ పోలీసులైతే ప్రజలకు రక్షణ ఇస్తూనే ఫ్రెండ్లీగా ఉంటున్నట్లు పేరు. అంతేకాదు ఆటో డ్రైవర్ పోలీసు స్టేషన్ కు వచ్చినా సార్ అని పిలవాల్సిందే అని పోలీస్ బాస్ పోలీసులకు ఆర్డర్లు పాస్ చేశారు. కానీ ఇవన్నీ కాగితాలకు పరిమితం. టివిల్లో అందంగా చెప్పుకునేందుకే పరిమితం. బయట పోలీసులు ఎట్లుంటరో అందరికీ తెలుసు. సామాన్యుల పట్ల వారు ఎలా ఉంటారు? పలుకుబడి ఉన్న వాళ్ల పట్ల ఎట్లుంటారు అన్నది ఎవరినడిగినా చెబతారు.

ప్రాణాలు కాపాడాల్సిన పోలీసు రక్షక్ వాహనం ఒక నిండు జీవితాన్ని పొట్టనపెట్టుకున్నది. నిత్యం హైదరాబాద్ రోడ్ల మీద దుమ్ము దూళి లేకుండా సాఫ్ చేసే ఒక జిహెచ్ఎంసి వర్కర్ ను పోలీసు రక్షక్ వాహనం తొక్కి చంపింది. పొద్దు పొద్దుగాల డ్యూటీ ఎక్కి రోడ్లు ఊకుతున్న పారిశుద్ధ్య కార్మికురాలి మీదు నుంచి పోలీసు జీపు వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

సాయమ్మ మృతితో ఏడుస్తున్న వర్కర్స్

వివరాలివి… రెయిన్ బజార్ యాఖుత్ పురా, బ్రహ్మాన్వాడి లో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులరాలిగా పనిచేస్తున్నారు సాయమ్మ అనే మహిళ. ఆమె మాదన్నపేటకు చెందిన మహిళ. జిహెచ్ఎంసి 7వ సర్కిల్ లో కార్మికురాలిగా పనిచేస్తున్నారు.

రోజు వారీలాగే గురువారం కూడా ఆమె పొద్దున్నే పనికి వచ్చారు. రోడ్డు ఊడుస్తున్న సమయంలో వేగంగా వచ్చిన పోలీసు రక్షక్ వాహనం ఆమె మీదుగా వెళ్లిపోయింది. దీంతో సాయమ్మ అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయింది.

సాయమ్మ ప్రాణాలు తీసుకున్న పోలీసు పాట్రోల్ రక్షక్ వాహనం నెం. TS09 PA 2211 జరిగిన ఘటనపై సాటి కార్మికులు వచ్చి కన్నీరు కార్చారు. సాయమ్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.