మూడు నెల ముందు వరకు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉండేది. కేసీఆర్ ను ఢీకొట్టగలిగే శక్తిసామర్ధ్యాలు హస్తానికి మాత్రమే ఉన్నాయని అంతా అనుకునేవారు. కానీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్పార్టీని వెనక్కు నెట్టేసి బీజేపీని పైకితెచ్చాయి. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. గెలవకపోయినా రెండో స్థానంలో అయినా కాంగ్రెస్ నిలుస్తుందని అనుకుంటే చిత్తుగా ఓడిపోయింది. బీజేపీ ఏకంగా గెలుపును సొంతం చేసుకుంది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతామని కాంగ్రెస్ బీరాలు పలికింది కానీ వాళ్ళకి అంత సీన్ లేదని అప్పటికే జనానికి అర్థమైపోయింది. ప్రధాన పోటీ తెరాస, బీజేపీల నడుమే ఉంటుందని స్పష్టంగా తెలిసొచ్చింది. ఎన్నికల్లో అలాగే జరిగింది కూడ.
పోలింగ్ సరళిలోనే కాంగ్రెస్ తేలిపోయిందని స్పష్టం కాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ఇప్పుడు వెలువడుతున్న ఓట్ల లెక్కింపు ఫలితాలు చూస్తే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని రూఢీ అయింది. మహా అయితే 5 లేదా 6 సీట్లకు మాత్రమే ఆ పార్టీ పరిమితమవుతుందనే అంచనా వచ్చేసింది. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టినా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డికి మాత్రం కలిసిరానున్నాయి. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన ఏకైక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. సీనియర్ నాయకులంతా అంతర్గత కలహాలతో, మొండి పట్టుదలలతో పార్టీని వెనక్కు లాగేస్తుంటే రేవంత్ ఒక్కరే నిజాయితీగా కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో పడిన కొద్దిపాటి ఓట్లు కూడ రేవంత్ రెడ్డిని చూసి పడినవేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్ లాంటి సీనియర్లు ఉన్నా అందరూ పీసీసీ అధ్యక్ష పదవికి పోటీపడ్డవారే తప్ప పార్టీని గెలిపించడంలో త్వరపడినట్లు కనబడలేదు. పైగా అధిష్టానం అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేసే సన్నాహాల్లో ఉండగా వీళ్లంతా అడ్డుపడినవాళ్ళే. రేవంత్ ప్రెసిడెంట్ అయితే తామంతా బయటకు వెళ్లిపోతామని, రేవంత్ రెడ్డి ఒక్కడితోనే పార్టీని నడుపుకోమని సంకేతాలు పంపారు. దాంతో ఎందుకొచ్చిన గొడవని హైకమాండ్ అధ్యక్ష పదవిలో మార్పు చేయకుండానే ఆగిపోయింది. కానీ రాబోయే ఫలితాలతో మోడికేస్తున్న సీనియర్ నాయకుల్ విలన్ పార్టీకి పెద్దగా లాభం ఉండదని పైపెచ్చు వారే పార్టీ ఎదుగుదలకు గండికొడుతున్నారని అధిష్టానానికి ఒక స్పష్టమైన అవగాహన వచ్చేస్తుంది. అప్పుడిక ఎవరు అడ్డుపడినా, ఎవరు అలిగినా రేవంత్ రెడ్డికి ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టడం ఖాయం. నిజానికి పార్టీలో రేవంత్ రెడ్డిని మించిన సామర్థ్యం, దూకుడు, ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరు. పార్టీని గాడిలో పెట్టడం ఆయనకే సాధ్యం తప్ప మరొకరి వల్ల కాదు.