కరీంనగర్ మాజీ ఎంపి, సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ చీటింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ డిసిసి అధ్యక్షులు కటకం మృత్యుంజయం కూడా ఈ వివాదంలో ఉన్నారు. ఒక మైనార్టీ మహిళ వద్ద 22 లక్షల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా మోసం చేశారని ఆ మహిళ గాంధీ భవన్ లో ధర్నాకు దిగారు. తనను నమ్మించి తన డబ్బు తీసుకుని ఇవ్వకపోవడేమ కాకుండా డబ్బు అడిగితే చంపుతామన్నట్లు బెదిరిస్తున్నారని ఆమె గాంధీభవన్ లో గోడు వెల్లబోసుకున్నారు. కరీంనగర్ కు చెందిన నజీమున్నిసా బేగం అనే యువతి శనివారం గాంధీ భవన్ కు వచ్చి ఆందోళన చేశారు. తన డబ్బు తనుకు ఇప్పించాలని ఆమె వేడుకున్నారు. ఈ విషయమై పొన్నం ప్రభాకర్, కటకం మృత్యుంజయం మీద రాహుల్ గాంధీకి రాతపూర్వక ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె చెబుతున్న పూర్తి వివరాలు ఏమిటో కింద చదవండి.
నా పేరు నజీమున్నిసా బేగం. నా తండ్రి 2005లో మరణించారు. తల్లి కూడా మరణించింది. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా అన్న నన్ను అంతమొందించి ఆస్థి మొత్తం తానే తీసుకోవాలని కుట్రలు చేశాడు. దీంతో నేను కోర్టులో కొట్లాడితే నా తండ్రి ఆస్థిలో వాటాగా నాకు కొంత సొమ్ము వచ్చింది. అయినప్పటికీ ఆ ఆస్థిని కాజేసేందుకు మా అన్న ప్రయత్నించాడు. మాది కాంగ్రెస్ ఫ్యామిలీనే. ఇప్పటి కరీంనగర్ డిసిసి అధ్యక్షులు కటకం మృత్యుంజయం మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. మా నాన్నకు క్లోజ్ ఫ్రెండ్. మా అన్నకు నాకు మధ్య గొడవలు చూసి కటకం మృత్యుంజయం నా పేరుతో వచ్చిన ఆస్థి తాలూకు నగదును ఆయన పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు. నీ అకౌంట్ లో ఆస్థి ఉంటే మీ అన్న నీకు ప్రమాదం తలపెట్టవచ్చు కాబట్టి డబ్బు నా డగ్గర ఉంటే సేఫ్ గా ఉంటుందని నమ్మ బలికాడు. నా బిడ్డ లాంటిదానివి.. నీకు రక్షణ కల్పిస్తానన్నాడు. ఆయన మాటలు నమ్మి దక్కన్ గ్రామీణ బ్యాంకులో నా అకౌంట్ లో ఉన్న నా డబ్బు అంతా 19,50,000 రూపాయలను కటకం మృత్యుంజయం అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాను. అంతేకాకుండా మరో రెండున్నర లక్షల లిక్విడ్ క్యాష్ ఇచ్చాను. రెండున్నర లక్షల డబ్బు ఇచ్చేటప్పుడు అప్పటి కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నాడు. ఆయన సమక్షంలోనే డబ్బు ఇచ్చాను. పొన్నం కూడా కటకం దగ్గరే డబ్బు దాచుకో అని నమ్మించాడు. ఇదంతా 2012లో జరిగింది.
తర్వాత ఆరు నెలల్లో నాకు పెళ్లి సంబంధం వచ్చింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అప్పుడు ఆ డబ్బు తెచ్చుకుని పెళ్లి చేసుకోవాలనుకుని కటకం దగ్గరకు వెళ్లి డబ్బు కావాలని అడిగాను. అప్పుడు ఆయన నువ్విచ్చిన డబ్బులో సగం పొన్నంకు ఇచ్చిన.. మిగతాది నాదగ్గర ఉంది అని అన్నాడు. పొన్నం సగం డబ్బు ఇవ్వగానే నా వాటా డబ్బు కూడా ఇస్తానని అన్నాడు. దాంతో నేను పొన్నం దగ్గరకు వెళ్లి డబ్బు అడిగాను. అప్పుడు పొన్నం నాకేం సంబంధం లేదని బదులిచ్చాడు. అంతేకాదు కటకం చాలా డేంజర్ క్యండిడెట్ ఆయనను మళ్లీ మళ్లీ డబ్బు అడిగితే నిన్ను చంపేస్తాడు జాగ్రత్త అని బెదిరించాడు. తర్వాత సకాలంలో డబ్బు చేతికి రాకపోవడంతో నాకొచ్చిన పెళ్లి సంబంధం కూడా క్యాన్సల్ అయింది. ఆరేళ్లుగా నా డబ్బు నాకు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకుండా కటకం, పొన్నం తప్పించుకు తిరుగుతన్నారు.
గాంధీభనవ్ వచ్చి పిసిసి ప్రసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా రెండుసార్లు కలిసి ఫిర్యాదు చేశాను. అయినా ఆయన న్యాయం చేస్తానని మాట ఇచ్చారు తప్ప చేయలేదు. అందుకే రాహుల్ గాంధీ సిటీకి వస్తున్నారని తెలుసుకుని మళ్లీ హైదరాబాద్ వచ్చాను. రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశాను. రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఇప్పుడు పూట గడవడం కూడా కష్టంగా ఉంది. ఆ డబ్బు ఇవ్వకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం. ఈ విషయంలో దయచేసి నాకు న్యాయం చేయండి. ఒక కాంగ్రెస్ ఫ్యామిలీకి చెందిన ఆడబిడ్డను ఇలా వేధించడం ఎంతవరకు కరెక్ట్? అని నజీమున్నిసా బేగం ‘తెలుగు రాజ్యం’తో చెప్పారు.
నజీమున్నిసా బేగం రాహుల్ గాంధీకి రాసిన ఫిర్యాదు లేఖను, ఆమె బ్యాంకు ట్రాన్ష్ ఫర్ చేసిన వివరాలను కింద ఉంచాము చూడండి.