ప్రస్తుత కాలంలో విద్యా, వైద్యం సామాన్య మానవుడికి చాలా భారంగా మారిపోయాయి. ప్రభుత్వ విద్యాలయాలు, వైద్య సంస్థలలో నాణ్యత లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్, ఆస్పత్రులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళటానికి మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ సంస్థలు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ వైద్య సంస్థలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. అక్కడ డబ్బు కడితేనే చికిత్స. చిన్న చికిత్సకు కూడా లక్షల్లో బిల్లులు వేసి. ఒకవేళ బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆఖరికి శవాన్ని కూడా ఇవ్వరు. తాజాగా హైదరాబాదులో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళ్తే…సయ్యద్ రహ్మత్ ఉద్దిన్ అనే అనే వ్యక్తి అనారోగ్యంగా ఉండటం వల్ల ఇటీవల శేరిలింగంపల్లి సమీపంలోని నల్లగండ్లలో ఉన్న సిటిజెన్స్ హాస్పిటల్‌లో చేరాడు . అతనిని పరీక్షించిన వైద్యులు హాస్పిటల్ లో అడ్మిట్ చేసి పది రోజులపాటు చికిత్స అందించారు. ఇలా పది రోజులు చికిత్స చేసినందుకు మొత్తం రూ. 54 లక్షల బిల్లు చెల్లించాల్సిందిగా బిల్లు చేతిలో పెట్టారు. అతని చికిత్స కోసం ఇప్పటికే తన కుటుంబ సభ్యులు రూ. 20 లక్షల వరకు డబ్బు చెల్లించారు. రూ.54 లక్షలు బిల్ వేయడంతో ఇక అంతకన్నా ఎక్కువ చెల్లించే పరిస్థితుల్లో మొర పెట్టుకున్నారు.
అయితే.. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం మరో
రూ. 29 లక్షల బిల్లు చెల్లించనిదే పేషెంట్ ని అక్కడి పంపించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఎంబిటి నేత అంజద్ ఉల్లా ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి కి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడికి చెక్ పెట్టే వ్యవస్థ ఏదైనా ఉంటే.. ఈ ఉదంతాన్ని పరిశీలించి ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అంజద్ ఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. వెంటనే ఆస్పత్రి పై చర్యలు తీసుకొని పేషంట్ ని అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రి లేదా నిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అంజాద్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లో చర్చంశనీయంగా మారింది.