తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్‌లోనే బీజేపీ – జనసేన మధ్య పొత్తు వుంది. తెలంగాణలో పొత్తు లేదు..’ అని గతంలో చెప్పుకున్న బీజేపీ, ఇప్పుడు మాత్రం, జనసేనతో ‘పొత్తుల చర్చలు’ షురూ చేసింది. టిక్కెట్ల పంపకాలపై సుదీర్ఘ కసరత్తు కూడా జరుగుతోంది.
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలపై జనసేన ఫోకస్ పెట్టింది. గత కొంతకాలంగా, జనసేన నుంచి ఈ నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. అభ్యర్థులూ యాక్టివ్‌గానే వున్నారు.
అయితే, ఈ రెండు నియోజకవర్గాల్నీ జనసేనకు ఇవ్వొద్దంటూ భారతీయ జనతా పార్టీలో లొల్లి షురూ అయ్యింది. జనసేనకు బీజేపీలో కొందరు ముఖ్య నేతలు ఇస్తోన్న ‘అతి’ ప్రాధాన్యతను, మరికొందరు బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
పార్టీ నుంచి ఒకరొకరుగా ముఖ్య నేతలు జారుతున్నా, బీజేపీ అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడంలేదు. కొందరైతే, జనసేన వల్లనే బీజేపీని వీడాల్సి వస్తోందంటూ, బీజేపీ అధినాయకత్వానికి లేఖలు రాసి మరీ, పార్టీని వీడుతుండడం గమనార్హం.
‘జనసేన వల్లనే గ్రేటర్ ఎన్నికల్లో గెలిచాం. ఇప్పుడు ఆ జనసేనని ఎలా వదులుకుంటాం..’ అంటూ లక్ష్మణ్ లాంటి సీనియర్ కమలనాథులు చెబుతుండడం విశేషమిక్కడ.
ఇంతకీ, జనసేన వల్ల బీజేపీకి ఏమన్నా లాభం వుంటుందా.? లాభం సంగతెలా వున్నా, నష్టమైతే చాలా తీవ్రస్థాయిలోనే జరిగేలా వుంది.