కవితకు నోటీసులు… ఆరోపణల లిస్ట్ పెద్దదే!

మహిళాదినోత్సవం తర్వాతి రోజున విచారణకు హాజరుకావాలంటూ… బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందించింది. హైదరాబాదీ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై.. “తాను కవిత బినామీని” అంటూ ఒప్పుకున్న విషయంపై వివరణకోసం కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే… అసలు ఈ కేసులో కవితపై వస్తున్న ఆరోపణలు ఏమిటి? కవిత బినామీ అంటూ పిళ్లైని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెడుతూ ఈడీ వేసిన రిమాండ్ రిపోర్టులో ఏముంది?

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబందించి సౌత్ గ్రూప్ లో కవితే కీలక పాత్ర పోషించారనేది ఆమెపై వస్తున్న ప్రధాన ఆరోపణ! ఇక లిక్కర్ వ్యాపారులను ఢిల్లీకి తీసుకువెళ్లారని, ఇందుకోసం ప్రైవేటు విమానాల్లో రాకపోకలు సాగించారని, ఈ వ్యవహారానికి సంబంధించి ఓబేరాయ్ హోటల్స్ లో మీటింగులు పెట్టారనేది కవితపై ఈడీ చెబుతున్న మరో ఆరోపణ. ఇదే క్రమంలో కవిత ద్వారానే ఢిల్లీలో ఆప్ కి ముడుపులు అందాయని.. ఆప్ తరఫున రంగంలోకి దిగిన విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చిందని.. ఇక ఆ ఆ సొమ్మును ఎలా తిరిగి పొందాలనే విషయంపై ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో సమావేశం అయ్యారనేది ఈడీ చేస్తున్న మరో కీలక ఆరోపణ!

ఇక సౌత్ గ్రూప్ లో కవితకు మేజర్ వాటా ఉందని.. తనకున్న సినీ పరిచయాలతో సినిమాల్లో కవిత బ్లాక్ మనీ పెట్టుబడులు పెట్టారనేవి కీలకంగా వినిపిస్తున్న మరో ఆరోపణ అని తెలుస్తోంది! ఇదే క్రమంలో… మద్యం ఉత్పత్తిదారులు – హోల్ సేల్ వ్యాపారులు – పలు రిటైల్ జోన్ల మధ్య కార్టెల్ ఏర్పాటు చేయడంలో కూడా రామచంద్ర పిళ్లై కీలకపాత్ర పోషించారని, అదంతా.. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై చేశారని ఈడీ ఆరోపిస్తుంది! కవిత కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్లో 32.5శాతం మేరకు భాగస్వామిగా ఉన్నారనేది ఈడీ రిమాడ్ రిపోర్ట్ తో వెలుగులోకి వస్తున్న మరో ప్రధానాంశం.

ఇక ఈ కేసులో కీలకంగా ఉన్న అరుణ్ పిళ్లై – ప్రేమ్ రాహుల్ లు కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి తరఫున బినామీలుగా ఇద్దరూ పెట్టుబడులు పెట్టినట్లుగా విచారణలో వెల్లడించారనేది ఇంకో ప్రధానాంశం. అయితే ఈ వ్యవహారానికి సంబందించిన విచారణలో… తాను ఏమి చేసినా అంతా కవితకోసమే అన్నట్లుగా పిళ్లై స్పందించారని – ఆయన కవిత బినామీ అనేది ప్రస్తుతం నోటీసులు అందడంలో కీలక భూమిక పోషించిందని తెలుస్తుంది! మరి ఈ స్థాయిలో కవితపై ఆరోపణలు వస్తుండటంతో… ఈడీ తీసుకునే తదుపరి స్టెప్ ఏమిటనేదానిపై అటు బీఆరెస్స్ లోను, ఇటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లోనూ ఆసక్తిగా నెలకొంది!