కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ తాజా రాజకీయ పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. అధికార టిఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. పనిలోపనిగా సొంత పార్టీ నేతలపైనా సున్నితంగా సెటైర్స్ వేశారు.
ఇటీవల పత్రికల్లో యాడ్స్ విషయంలో భర్తను మార్చిన వివాదంపై డికె అరుణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సిఎం కేసీఆర్ తమ ప్రచారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని తప్పుడు ప్రకటనలతో అర్థమైందన్నారు. తెలంగాణ సర్కారు చేస్తున్న పనులు శూన్యం కానీ ప్రచార ఆర్భాటం మాత్రం దేశవ్యాప్తంగా చేస్తున్నారని విమర్శించారు. భూమి లేని వారి ఫొటోలతో రైతు బీమా కల్పించామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. భర్త ఫోటోను మార్చి పరాయి వ్యక్తి ఫొటోను ఆమె భుజంపై చెయ్యి వేసి ప్రచురించడం ఆ మహిళను కించపరచడమే అన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
ఆ బాధిత కుటుంబానికి కేసీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం యాడ్ ఏజెన్సీ పై చర్యలతో కేసీఆర్ సర్కారు చేతులు ఫులుపుకుంటే సరిపోదన్నారు. మానసిక క్షోభకు గురవుతున్న ఆ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి మూడెకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో తనకు జైపాల్ రెడ్డితో, రేవంత్ రెడ్డితో విబేధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను డికె అరుణ ఖండించారు. జైపాల్ రెడ్డితో విభేదాల విషయంలో సెటైర్ వేశారు. తనకు, జైపాల్ రెడ్డికి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నదని, దుకే విబేధాలు వస్తున్నాయని పంచ్ వేశారు. రేవంత్ రెడ్డికి తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల తర్వాత సిఎం ఎవరనే విషయాన్ని రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని డికె అరుణ తేల్చి చెప్పారు.
పిసిసి రేస్ లో తాను ఉన్నానని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిన సమయంలో జరిగిన మహిళల సమావేశంలో తనను మాట్లాడనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.