చరిత్ర ఎంతో ఘనం.. ప్రస్తుతం మాత్రం అయోమయం. ఈ మాట తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రాలో ఏనాడో కనుమరుగైపోయిన హస్తం తెలంగాణలో మాత్రం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా నిలదొక్కుకోవాలని మొదటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ప్రతి దశలోనూ విఫలమవుతూనే వస్తోంది. ఇందుకు తెరాస బలం ఒక కారణమైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఇంకొక ప్రధానమైన రీజన్. పేరుకు అందరూ సీనియర్ నాయకులే అయినా ఒక్కరిలోనూ పార్టీని నిలబెడదామనే లక్ష్యం లేదు. మొదట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరినీ ఒక తాటి మీదకు తేవాలని ప్రయత్నించినా సహచరుల తీరు చూసి ఇక లాభం లేదనుకుని మానుకున్నారు.
దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మొదలుకుని ఉప ఎన్నికలు, లోకల్ ఎలక్షన్లు ఇలా అన్ని దశల్లోనూ పార్టీ ఎదురుదెబ్బలు తింటూనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఘనతను నిలుపుకోవడంలో నూటికి నూరు శాతం విఫలమైంది కాంగ్రెస్. పార్టీలో బలమైన, సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పీసీసీ చీఫ్ పదవి మీద ఆశతో అందరూ సొంత ప్రయోజనాలకే పరిమితమైపోయారు. రేవంత్ రెడ్డి లాంటి లీడర్ ఒంటరి ప్రయత్నం చేసినా సీనియర్లు అడ్డుతగలడం పార్టీని మరింత కుంగదీసింది. ప్రధాన ప్రత్యర్థి అనే స్థాయి నుండి అసలు ఉనికే లేదు అనే స్థాయికి దిగజారిపోయింది. పార్టీలో చేరిన ఆరంభంలోనే రేవంత్ రెడ్డికి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది అధిష్టానం. రేవంత్ సైతం పూర్తి భాద్యతను తీసుకుని పోరాడుతూ వచ్చారు.
నెమ్మదితనంతో పనులు జరగవని, దూకుడుగా వెళ్లడమొక్కటే మార్గమని రేవంత్ సూచించినా ఆలోచన, అణకువ అంటూ కబుర్లు చెప్పి వీహెచ్ లాంటి సీనియర్లు అడ్డంపడ్డారు. చివరికి దుబ్బాక ఉప ఎన్నిక సహా గ్రేటర్ ఎన్నికల్లోనూ పార్టీ దారుణమైన పరాభవాన్ని చూడాల్సి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడ దక్కలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వరుస ఓటములతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పగ్గాలు వదిలేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి పదవి ఖాయమని, ఇకనైనా పార్టీకి మంచి రోజులు వస్తాయని కార్యకర్తలు భావించారు. కానీ ఇంత జరిగినా కూడ పార్టీలోని కొందరి వైఖరి మారలేదు. పదవి కోసం రేవంత్ రెడ్డితో పోటీకి దిగుతున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు పదవి మాకు కావాలంటే మాకు కావాలని అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు. ఒత్తడితో పాటు కలిసి నడవమనే బెదిరింపులు కూడ ఉండనే ఉంటాయి. దీంతో మరోసారి హైకమాండ్ చిక్కుల్లో పడ్డట్టైంది. నిజానికి రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే పార్టీకి పైకి తీసుకురాగల వాడి వేడి ఇతర లీడర్లకు లేదు. కేవలం ఒక్క సీనియారిటీ మినహా వారి దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు. జనంలో సైతం కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి పేరు తప్ప మరొకరి పేరు వినబడట్లేదు. మరి ఇవన్నీ వారికి తెలియవా అంటే బాగా తెలుసు. కానీ సీనియర్లు అయిన మాకు కాకుండా కొత్త వ్యక్తికి పదవి ఎందుకు కట్టబెడతారనే పంతం అంతే. ఈ పంతంతోనే పార్టీ పతనానికి కారణమయ్యారు. ఇకపైన కూడ ఇలాగే ఉంటే స్వయంగా రాహుల్ గాంధీ, సానియా గాంధీ వచ్చి హైదరాబాద్లో తిష్టవేసుకుని కూర్చున్నా పార్టీని బ్రతికించుకోవడం కష్టం.