రెండు మూడేళ్ళుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆయోమయంలోనే ఉంది. ఆ అయోమయమే వాళ్ళను ఈరోజు పాతాళానికి తొక్కేసింది. ఉమమ్డి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ఆయన తర్వాత పతనమవడం మొదలైంది. సరైన నాయకత్వం లేక చెల్లాచెదురైంది. రాష్ట్రం విడిపోయాక మరీ విచ్ఛిన్నమైపోయింది. ఆంధ్రా మీద పూర్తిగా ఆశలు వదిలేసుకొని తెలంగాణలో అయినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పేరుతో నెట్టుకురావొచ్చని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. తెలంగాణ జనం పార్టీకి దశల వారీగా తిరస్కరిస్తూ వస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం నాయకత్వ లోపం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తలో దిక్కూ వెళుతున్న లీడర్లను ఒక్కచోటుకు తేవడానికే ఇన్నేళ్లు పట్టింది. చివరికి వల్ల కాక దుబ్బాక ఓటమికి బాధ్యత వహించే సాకుతో ఆయన పీసీసీ పగ్గాలు వదిలేశారు.
ఆ పగ్గాల కోసం ఎన్నాళ్లగానో పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. సీనియర్ నాయకులు మరీ మూర్ఖంగా పదవి కోసం కొట్లాడుకుంటూ ప్రజల్లో పలుచనయ్యారు. ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది పోయి పదవి కోసం పోరాటం చేశారు. ఉత్తమ్ కుమార్ ఉన్నన్ని రోజులు ఆయన మీద పరోక్షంగా విముఖత చూపిన నేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నేరుగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇటీవలే పాట్టీలోకి వచ్చిన రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకుంటూనే దూకుడుగా వెళ్లడం మొదలుపెట్టారు. పార్టీ నుండి ఎలాంటి మద్దతూ లేకపోయినా కేసీఆర్ మీద ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఆయన వలన ఏం తప్పూ జరక్కపోయినా దూరం పెట్టారు సీనియర్లు. రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యం అవసరం లేదన్నట్టు వ్యవహరించారు.
కానీ రేవంత్ మూలాన కాంగ్రెస్ పార్టీ చాలానే లాభపడింది. ఆయన మాస్ ఇమేజ్ పార్టీకి కలిసొచ్చింది. ఆయన ఉండబట్టే కనీసం జనం కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి ఎంపిక కసరత్తు జరుగుతోంది. అధిష్టానం రేవంత్ మీదే ఉంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబులు పదవి కావాలంటున్నారు. తమలో ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం కానీ రేవంత్ రెడ్డికి ఇస్తే మాత్రం పార్టీని వీడతామని బెదిరిస్తున్నారు. ఈమేరకు అధిష్టానానికి అజ్ఞాత లేఖలు కూడా వెళ్లాయట. ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్న రేవంత్ తన ఏర్పాట్లలో తాను ఉన్నారట. చీఫ్ పదవి వచ్చి అందరూ కల్సి కట్టుగా ఉంటే ఉన్నట్టు లేకుంటే అసలు పార్టీలోనే లేకుండా వేల్లోపోవాలని, సొంత పార్టీ పెట్టుకోవాలని చూస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.
ఒకవేళ రేవంత్ సొంత పార్టీ పెట్టకపోయినా ఆయన కోసం బీజేపీ తలుపు తెరుచుకుని కూర్చుంది. ఆయన వస్తానంటే మంచి పదవి కట్టబెట్టి అందలం ఎక్కిస్తుంది. ఇప్పుడు బీజేపీ ఉన్న దూకుడుకు రేవంత్ రెడ్డి కలిస్తే నిప్పుకు గాలి తోడైనట్టే. ఆ కార్చిచ్చు ముందు కాంగ్రెస్ పార్టీనే దహించి వేస్తుంది. ఈ సంగతిని గుర్తెరిగి ఆయనతో శత్రుత్వానికి పోకుండా ఎదగడానికి ఉపయోగించుకుంటే హస్తం పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.