దిల్ సుఖ్ నగర్ లోని శ్రీచైతన్య కళాశాలకు చెందిన అర్చన అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి జిల్లా నారాయణపురానికి చెందిన అర్చన చైతన్యపురి పరిధిలోని కృష్ణవేణి క్యాంపస్ నందుగల చైతన్య మహిళ హాస్టల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో ఒత్తిడి వల్లనే అర్చన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్ధిని మృతిపై తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది సమాచారం అందించారు. విద్యార్దిని మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్ది సంఘాలు, రేవంత్ మిత్రమండలి నాయకులు కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలల ఒత్తిడులు, వేధింపుల వల్ల అనేక మంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అయినా ప్రభుత్వం అటువంటి కళాశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కళాశాలల్లో ఆత్మహత్యలపై వెంటనే విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఎంసెట్ కుంభకోణంలో ఇదే కళాశాలకు చెందిన డీన్ వాసుబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పోరేట్ కళాశాలల కబంధ హస్తాల నుండి విద్యార్ధులను కాపాడుకుందామని, తెలంగాణ విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని రేవంత్ మిత్ర మండలి పిలుపునిచ్చింది.