దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. నేడు బీఆరెస్స్ శ్రేణులకు ప్రశాంతత లేకుండా.. కవిత ఫ్యాన్స్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కథంతా కవిత ఫోన్ చుట్టూ తిరుగుతుందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. కావాలనే ఫోన్స్ అన్నీ కవిత ధ్వంసం చేశారని ఈడీ చెబుతుంటే… “నా ఫోన్స్ ఇవిగో” అని ప్రపంచానికి చూపిస్తున్నారు కవిత! దీంతో… కవిత కథలో ఫోన్ పాత్ర చాలా కీలకం అని అంటున్నారు విశ్లేషకులు! ఈ ఫోన్ లు ప్రదర్శించడంతో కవిత ఈడీకి లాజిక్ తో సమాధానం చెప్పినట్లయ్యిందని అంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మూడో రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ కు ఆమె లేఖ రాశారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ కోణంలోనే తనను విచారిస్తున్నారని.. ఈడీ అధికారులు దురుద్దేశంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అందుకే గత రెండేళ్లుగా తాను వాడిన ఫోన్లను ఈడీకి అందజేస్తున్నామని పేర్కొన్నారు కవిత.
ఇదే క్రమంలో… తాను ఫోన్లు ధ్వంసం చేశానని తప్పుడు ప్రచారం చేశారని, ఏ ఉద్దేశంతో ఇలా చేశారని ప్రశ్నించారు. ఇక, విచారణ పేరుతో ఒక మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా… తన ఫోన్లు స్వాధీనం చేసుకునే విషయంలో కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేసిన కవిత… గత నవంబర్ లోనే తన ఫోన్లు ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో… ఇప్పటివరకు తాను ఉపయోగించిన మొబైల్ ఫోన్లను ఈడీకి సమర్పిస్తానని తెలిపారు.
ఈ క్రమంలో ఈడీ విచారణకు వెళ్లే ముందు ఆమె వాడిన ఫోన్లను ప్లాస్టిక్ కవర్ లో పెట్టి మీడియాకు చూపించారు కవిత. ఫైనల్ గా… “ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం. అందుకే నా పాత ఫోన్లన్నీ ఈడీ అధికారికులకే ఇచ్చేస్తున్నా” అంటూ కవిత చెప్పడంతో… లాజిక్ తో ఈడీకి ఇచ్చిపాడేసిందని అంటున్నారు ఆమె అభిమానులు!
కాగా… సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు కవిత 10 ఫోన్లు వాడినట్లు, ధ్వంసం కూడా చేసినట్లు ఈడీ అభియోగం ఉంది. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారని ఈడీ అభియోగాలు ఉన్నాయి. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్ లో కూడా కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ స్పష్టంగా తెలిపింది.