తెలంగాణ ఎన్నికలల్లో బిజెపి తరపున పోటి చేసే 28 మంది అభ్యర్దుల రెండో జాబితాను శుక్రవారం బిజెపి నాయకత్వం విడుదల చేసింది. ఇందులో సిని హీరోయిన్ కు అవకాశం కల్పించారు. వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్దిగా సిని నటి రేష్మ రాథోడ్ ను ఎంపిక చేశారు. సిని గ్లామర్, యూత్ సపోర్ట్ ఆమెకు కలిసొచ్చే అవకాశాలుగా ఉన్నాయి.ముందుగా మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని అడిగినా అసెంబ్లీకి రేష్మా రాథోడ్ ను ఎంపిక చేశారు.
రేష్మా రాథోడ్.. స్వస్థలం ఖమ్మం జిల్లా ఇల్లందు. మణుగూరులో ఆమె విద్యాభ్యాసం పూర్తి చేశారు. సినిమా రంగంలో అవకాశాలు రావడంతో ఆమె కొన్నాళ్ల పాటు ముంబాయిలో ఉన్నారు. ఆ తర్వాత హైద్రాబాద్ లో సెటిలయ్యారు.
డైరెక్టర్ మారుతి ఫస్ట్ సినిమా “ఈ రోజుల్లో” తో ఆమె హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆమె మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నాలుగు సినిమాల్లో నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలనే డిమాండ్ తో తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని ఆమె తెలిపారు.
బిజెపిలో రేష్మా సంవత్సరం కింద చేరారు. బిజెపి నాయకత్వం ఆమెను తెలంగాణ యూత్ సెక్రటరీగా నియమించింది. ముందుగా ఆమె మహబూబాబాద్ ఎంపీ టికెట్ కావాలని అడిగారు. ఎంపి టికెట్ దాదాపు ఖరారు అనే ఉద్దేశ్యంతో ఆమె మహబూబాబాద్ లో చాలా సార్లు పర్యటించారు. సభలల్లో పాల్గొన్నారు. నియోజకవర్గం అంతా తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. కానీ అనూహ్యంగా బిజెపి ప్రకటించిన రెండో జాబితాలో ఆమెకు వైరా అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు.
అసెంబ్లీ సీటు కేటాయింపు కూడా రేష్మా రాథోడ్ కు కలిసొచ్చే అవకాశంతో పాటు బిజెపి విజయం కూడా ఖరారైనట్టేనని నేతల ద్వారా తెలుస్తోంది. రేష్మా రాథోడ్ సొంత జిల్లాతో పాటు సిని గ్లామర్ కూడా బిజెపికి పనికొచ్చే అవకాశంగా ఉంది. రేష్మా సిని స్టార్, యూత్ లో జోష్ నింపే సత్తా ఉండటంతో ఆమె గెలుపు ఖాయమనే ధీమాలో బిజెపి నేతలున్నారు. రేష్మా రాథోడ్ కూడా తన స్వంత జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్ కేటాయించడంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానన్నారు.
వైరా సీటు కేటాయింపు కావడంతో బిజెపి శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు. రేష్మా ప్రచారానికి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. నియోజక వర్గం ప్రచారంలో రేష్మా తనకున్న పరిచయాలతో మరికొంత మంది సిని ప్రముఖులను కూడా వైరాకు తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.