Mahaa news office: హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దాడిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మీడియాపై దాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే అని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు మండిపడుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు మహా న్యూస్ కార్యాలయంపై బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్ధాలు, బయట పార్క్ చేసిన కార్లు అద్ధాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. “హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు.
మీడియాలో వచ్చిన వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇలా భౌతిక దాడులకు పాల్పడటం సమంజసం కాదని హితవు పలికారు. ఈ దాడికి కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన గూండాలు పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నమేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. ఈ దాడి కేవలం ఒక భవనం మీద జరిగింది కాదని నేరుగా పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి అని తెలిపారు. న్యూస్ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరిపై ఆరోపణలు వచ్చాయని.. ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ గూండాలు ఈ దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన మహా న్యూస్ ఛానెల్‌పైనే ఇప్పుడు దాడికి దిగడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
మరోవైపు ఈ దాడిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం లేదన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల బాధ, గౌరవం అర్థం చేసుకోగలనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోవడంపై పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచనలు చేశారు.