తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య ప్రణయ్ కేసులో నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య విషయం అందరికీ తెలిసిందే. మారుతీరావు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాధమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మారుతీ రావు ఆస్తుల విషయాల్లోనే ఇది జరిగి ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆత్మహత్యకు పాల్పడిన మారుతీరావు అంత్యక్రియలు నేడు జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన రాసిన లేఖ ఓ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తన కూతురిని కలుసుకోవాలని గత కొంత కాలంగా మారుతీ రావు తీవ్ర ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. అది సాధ్యపడలేదో.. మరి ఆస్తుల గొడవలే కారణమో గానీ.. మారుతీ రావు ఆత్యహత్య చేసుకున్నారు. తన కూతురిని తల్లి దగ్గరకు వచ్చేయమని లేఖలో కోరారు. అయితే తన తండ్రిని చూసేందుకు వస్తే తమ ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అమృత భావిస్తోందట. చివరి సారి తండ్రి మృతదేహాన్ని చూసేందుకు పోలీసుల సహకారం కోరినట్టు తెలుస్తోంది. అయితే మారుతీరావు కోరిక కూడా అదే కావడంతో అమృత తల్లి ఇందుకు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. అలాగే అమృత బాబాయ్ శ్రవణ్ కూడా అమృతని అడ్డగించం అని చెప్పేశాడు.
అమృత తన తండ్రిని చివరి చూపు చూసేందుకు అనుమతి ఇచ్చిన మారుతీ రావు భార్య.. జీవితంలో ఇక కూతురితో మాట్లాడనని తేల్చి చెప్పింది. నా భర్తను నాకు కాకుండా చేసిన బిడ్డతో నాకు ఎలాంటి సంబంధం వద్దనీ కన్నీరు మున్నీరుగా విలపించింది. తన భర్త కూతురి కోసం ఎంత క్షోభను అనుభవించాడో తలుచుకుని.. తలుచుకుని ఆమె కుమిలిపోతోంది. భర్త మృతదేహాన్ని చూసి ఆమె రోధిస్తున్న తీరు చూసి అందరినీ కంటతడి పెట్టిస్తోంది.