కేసీఆర్ మాటల ఆంతర్యం అదేనా?

ప్రస్తుత కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల, విద్యార్థులను కూడా కాపాడుకుంటామని పెద్ద మనసు చాటుకునన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏ అనుమానాలు పెట్టుకోవద్దని హామీ కూడా ఇచ్చారు. అయితే దీనితో పాటే ఆయన చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏంటి ఆ వ్యాఖ్య..?

కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు వ్యాధి నుంచి కోలుకోగా, మిగిలిన 58 మందికి చికిత్స కొనసాగుతోంది. అయితే ఇక్కడే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది.

రాష్ట్రంలో 11000 ఐసోలేషన్ బెడ్స్, 1400 క్రిటికల్ బెడ్స్ రెడీగా ఉన్నాయన్నారు కేసీఆర్. అలాగే 60 వేల మంది కరోనా పేషెంట్లు ఉన్నా హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టే పరిస్థితి ఇలా అయినా ఉందని ఆయన అన్న వ్యాఖ్యలను చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలంగాణలో పరిస్థితి మరింత క్రిటికల్‌గా ఉండొచ్చన్నది అర్థమవుతోంది.

ముఖ్యంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఒక్క రోజే పది కేసులు నమోదు అవ్వడం అన్నది చిన్న విషయం కాదు. మనకు ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే.. స్వీయ నియంత్రణను విస్మరిస్తే.. ఇక ప్రభుత్వాలు సైతం ఏమీ చేయలేవన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే అత్యధిక కేసులతో కేరళ, తర్వాత మహారాష్ట్ర విలవిల్లాడుతున్నాయి. చర్యలను తీవ్రతరం చేశాయి. అలాంటి పరిస్థితులు రాకూడదనే కేసీఆర్ ఇలా పదే పదే.. హెచ్చరికలు చేస్తున్నారన్నది ఆయన మాటల వెనుక ఆంతర్యంగా కనిపిస్తోంది. ఈ స్థితిని ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరిస్తే ఆయన లక్ష్యం కూడా నెరవేరుతుంది.