2019 సంవత్సరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం కలిసిరాలేదు.రాజకీయంగా ఆయన వైఫల్యాలను మూటగట్టుకున్నారు. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతల్లో ఉన్న ఆయనపై పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో ఓటమికి ప్రధాన ముద్దాయిగా మారారు అన్నచర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడంలో పూర్తిగా ఆయన వైఫల్యం చెందడంతో నాయకుల మధ్య సమన్వయలోపాన్ని నివారించలేదన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి.
దీనికితోడు పొత్తు విషయంలో తీవ్ర తప్పిందం ఆయన దగ్గరుండి మరీ చేయించారని, అధిష్ఠానాన్ని అలర్ట్ చేయడంలో ఆయన ఏమాత్రం చొరవ తీసుకోలేదని ఫలితంగానే పార్టీకి ఘెర ఓటమి తప్పలేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది.. ఇలా సర్వత్రా ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఆయన హుజూర్నగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే అటు తర్వాత నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా అధిష్ఠానం సూచించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగి విజయం సాధించారు.
అయితే ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. అక్కడ టీ ఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించారు. దీంతో సొంత నియోజకర్గాన్ని ఆయన కోల్పోవల్సి వచ్చింది. ఈ ఎన్నికకు ముందు భార్యకు టికెట్ ఇప్పించుకున్నాడంటూ పార్టీలో పెద్ద దూమారమే రేగింది. రేవంత్‌రెడ్డిలాంటి నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయినా అధిష్ఠానం వద్ద తనకున్న పలుకుబడి, పరపతితో టికెట్ ఇప్పించుకున్నా గెలిపించుకోలేక పోయారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కొంతమంది తన వర్గం నేతలకే టికెట్లు ఇప్పించుకున్నారన్న ఆరోపణలు ఆయనపైనా ఉన్నాయి. ఇప్పుడు టీపీసీసీచీఫ్ పదవి నుంచి కూడా ఆయన్ను తప్పించేందుకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఆ పదవికి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిలు రేసులో ఉన్నారు. ఉత్తమ్ పరిస్థితి కాంగ్రెస్‌లో నానాటికి దిగజారుతూ..చివరికి నామమాత్రంగా మారింది. మరి ఇప్పుడు జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పరువు నిలుపుకునేలా గెలిచి ఉత్తమ్ రాజకీయ భవిష్యత్తును కాపాడుతుందో ? లేదో ? చూడాలి.