కరోనా మార్చిన జీవితాలు : ఓ ఒలింపిక్ విజేత, మరో క్రికెటర్ డెలివరీ బాయ్స్​గా మారారు..

కరోనా వైరస్ మనుషుల జీవితాలతో చెలగాటం ఆడుకుంది. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. మానవ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితులను కూడా ఈ వైరస్ దెబ్బతీసింది. ఇక క్రీడారంగం విషయానికి వస్తే..అన్ని చిన్నా, పెద్ద టోర్నీలు వాయిదా పడ్డాయి. మరికొన్ని రద్దయ్యాయి. దీంతో కొందరు ఆటగాళ్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. పూట గడవడం కూడా కష్టంగా మారినవాళ్లు కూడా ఉన్నారు. దీంతో వారు తమ కుటుంబాల్ని కాపాడుకోవడానికి ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా మారారు. అందులో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ రుబన్ లిమార్డో కూడా ఉండటం గమనార్హం. పోలాండ్​లో అతడు ఫుడ్​ డెలివరీ చేస్తూ కనిపించాడు. తాను డెలివరీ బాయ్‌గా మారినట్లు స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లండన్ ఒలింపిక్స్​లో ఫెన్సింగ్​లో స్వర్ణ పతాకకం సాధించాడు రుబన్. ” ఇంటి ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుకోవడం కోసం ఆటతో పాటు రెండో ఉద్యోగం చేస్తున్నానని చెప్పడానికి గర్వంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు జివితాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ధైర్యవంతులు అదే పని చేస్తారు” అని ఇన్​స్టా​లో రుబన్ పేర్కొన్నాడు.

ఇదే బాటలో నెదర్లాండ్​ క్రికెటర్​ కూడా :

కోవిడ్ తన లైఫులో ఎన్ని ఒడిదొడుగులు తీసుకువచ్చిందో చెబుతూ నెదర్లాండ్‌ క్రికెటర్‌ పాల్‌ వాన్‌ మీకెరెన్‌ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. వరల్డ్‌కప్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిన తాను.. ప్రస్తుతం రోజు గడవడం కోసం డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాని తెలిపాడు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగాల్సి ఉంది. అయితే, వైరస్ విజృంభణతో వాయిదా వేశారు. ఈ మహమ్మారి లేకపోతే మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌లో ఫైనలను వీక్షించేవారిమని ఈఎస్‌పీన్‌ క్రిక్‌ఇన్ఫో ఆదివారం ట్వీట్‌ చేసింది.

దీన్ని పాల్ వాన్‌ రీట్వీట్ చేస్తూ.. “ఈ రోజు క్రికెట్‌ ఆడుతూ నేను గ్రౌండ్‌లో ఉండాల్సింది. కానీ, ప్రస్తుతం చలికాలం నెలల్ని నెట్టుకెళ్లేందుకు ఉబర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా వర్క్ చేస్తున్నాను. విధి ఇలాంటి ఆట ఆడుతుందని ఊహించలేదు. పరిస్థితుల్ని మార్చేస్తుంది. అయినా వాటిని ఎదుర్కుంటూ నవ్వుతూ మనం ముందుకు సాగిపోవాలి” అని రాసుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితులను అధిగమించి తిరిగి క్రికెట్‌ ఆడతావని నెటిజన్లు అతడికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. నెదర్లాండ్స్‌లో పేరున్న బౌలర్‌ అయిన పాల్‌ వాన్‌ ఇప్పటివరకు 5 వన్డేలు, 39 టీ20లు ఆడారు. టీ20లలో అతడు 47 వికెట్లు పడగొట్టాడు.